దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 606మంది వైరస్ బారిన పడగా.. ఇవాళ ఆ సంఖ్య 694కి పెరిగింది. ఇప్పటివరకు 16మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
రాష్ట్రాల వారీగా పరిస్థితి ఇలా..
కేరళలో ఇవాళ 19 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 126కు చేరింది. 1.20లక్షల మందిని పరిశీలనలో ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం.
మహారాష్ట్రలోనూ కరోనా ప్రభావం అధికంగా ఉంది. తాజాగా మరో ముగ్గురు వైరస్ బారిన పడగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 125 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబయిలో చికిత్స పొందుతున్న ఓ 65ఏళ్ల వృద్ధురాలు.. గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. వైరస్ పాజిటివ్‌గా తేలినప్పటికీ... మృతిచెందడానికి గల కారణాలను పరిశీలిస్తునట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
21రోజుల లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన వారిపై ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. నిబంధనల ఉల్లంఘన పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేల కేసులు నమోదయ్యాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరకుల షాపులను 24 గంటలు తెరిచేందుకు అనుమతిచ్చింది.
మహమ్మారికి ధాటికి గుజరాత్లో 70 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. అతడితో కలిపి మొత్తం ముగ్గురు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో మరో నలుగురు వైరస్ బారిన పడగా... మొత్తం కేసుల సంఖ్య 43కు చేరింది.
కర్ణాటకలో మరో మహిళ మరణించినట్లు ప్రకటించారు అధికారులు. మృతురాలు ఇటీవలే సౌదీ అరేబియా నుంచి వచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కారణంగా ఒకరు మరణించగా.. ఇది రెండో మరణం. 41 మందికి వైరస్ సోకగా.. ముగ్గురు కోలుకున్నారు.
రాజస్థాన్‌లోని బిల్వారాలో 73ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ఆయన చికిత్స పొందిన ఆసుపత్రిలో కొందరు వైద్యులు, నర్సులూ వైరస్ బారినపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 40 మందికి వైరస్ సోకింది.
జమ్ముకశ్మీర్, తెలంగాణ, దిల్లీ, బిహార్, గోవాలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది.
లక్షా 70వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ...
కరోనాపై పోరుకు దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూసిన ఆర్థిక ప్యాకేజీని నేడు కేంద్ర ప్రభుత్వం ప్రకటిచింది. లక్షా 70వేల కోట్లతో పేదలకు ఆపన్న హస్తంగా నిలిచేందుకు 'ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్' పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది.
కరోనా కట్టడికి ఇప్పటికే దేశనలుమూలల నుంచి ప్రశంసలు అందుకుంటున్న కేంద్రం.. ఆర్థిక ప్యాకేజీతో కాంగ్రెస్ మన్ననలూ పొందింది.
ఆసుపత్రులు...
కరోనా వైరస్ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెరో వెయ్యి పడకల సామర్థ్యంతో రెండు ఆసుపత్రులను నిర్మించనుంది. 14రోజుల్లో ఇవి అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. కేవలం కరోనా రోగులకే చికిత్స అందించనున్నాయి ఈ ఆసుపత్రులు.
రెండో రోజు లాక్డౌన్...
మరోవైపు దేశవ్యాప్తంగా 21రోజుల లాక్డౌన్లో రెండో రోజు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. అయినా పలు ప్రాంతాల్లో ప్రజలు వాహనాలతో రోడ్లపై తిరుగుతున్నారు. దీనితో పోలిసులు అటువంటివారిని ఎక్కడిక్కడే అడ్డుకున్నారు. వింత వింత చర్యలతో శిక్షించారు. కొందరు లాఠీలతో ప్రజలను కొట్టగా.. మరికొందరు 'కప్ప గంతులు' వేయించారు.
లాక్డౌన్ సమయంలో తమకు తిండి దొరకడం లేదని కొందరు పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలితో కన్నా వైరస్‌తో చనిపోవడం మేలని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అయితే.. మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నారు. ప్రజలకు ఆహార పొట్లాలు అందిస్తున్నారు.
సామాజిక దూరంపై కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. బంగాల్ ముఖ్యమంత్రి ఒకడుగు ముందుకేసి.. స్వయంగా కోల్‌కతాలోని ఓ మార్కెట్‌కు వెళ్లారు. సామాజిక దూరంతోనే వైరస్‌ను నియంత్రించవచ్చని అక్కడి కూరగాయల వ్యాపారులకు తెలిపారు. అంతేకాకుండా.. స్వయంగా ఇటుకతో వృత్తాకారాలు గీసిన దీదీ.. కూరగాయలు కొనేటప్పుడు ప్రజలు వాటిల్లోనే నిలబడాలని సూచించారు.