తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక ప్రాంతాల్లో పరిస్థితి ఏమాత్రం మారలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సైనిక ప్రతిష్టంభనకు పరిష్కారం కోసం అయిదు రోజుల క్రితం భారత్, చైనా విదేశాంగ మంత్రులు భేటీ అయినప్పటికీ.. సరిహద్దులో పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయని స్పష్టం చేశాయి.
వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాల సైన్యం తమతమ ప్రదేశాల్లో స్థిరంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే చైనా సైన్యంలో తాజాగా ఎలాంటి కదలికలు లేవని తెలిపాయి. అయినప్పటికీ భారత సైన్యం భద్రత ఏర్పాట్లను తగ్గించడం లేదని వెల్లడించాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడేంత వరకు తూర్పు లద్దాఖ్‌లో యుద్ధ సన్నద్ధతను సైన్యం కొనసాగిస్తుందని స్పష్టం చేశాయి.
ఇరుదేశాల మధ్య జరిగే కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక సమావేశానికి సంబంధించిన తేదీలను ఇంకా నిర్ణయించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ భేటీ జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరుదేశ విదేశాంగ మంత్రులు అంగీకరించిన ఐదు సూత్రాల నిబంధన అమలుపై సమావేశంలో చర్చించనున్నట్లు వివరించాయి.