లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళలకు సాయం అందించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 50కి పైగా హెల్ప్లైన్లు ప్రారంభించింది. వీటి ద్వారా దేశంలో ఎక్కడైనా మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింసపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.
హెల్ప్లైన్స్ ఇవే...
⦁ జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ - 181
⦁ మహిళా పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ - 1091, 1291
⦁ సైకాలజిస్టును సంప్రదించడానికి 9000070839, 0402760531.
వీటిలో కొన్ని చాలా కాలంగా పనిచేస్తుండగా, మరికొన్ని లాక్డౌన్ సమయంలో మహిళలకు సహాయం అందించేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసినవి.
అన్ని స్థాయిల్లో సాయంగా
ఈ 52 హెల్ప్లైన్లలో కొన్ని జాతీయ స్థాయిలో, కొన్ని రాష్ట్ర స్థాయిలో, మరికొన్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్లైన్లను పోలీసులు, మహిళా సంక్షేమ సంఘాలు, మహిళల హక్కుల కోసం పని చేస్తున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయని అధికారులు తెలిపారు.
లాక్డౌన్ వేళ గృహ హింస ఎదుర్కొంటున్న మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఏర్పాటుచేసిన హెల్ప్లైన్లు వారికి ఎంతగానో ఉపయోగపడతాయని పోలీసులు భావిస్తున్నారు.
గృహ హింసకు పాల్పడుతున్నట్లు ఏ పురుషునిపై అయినా ఆరోపణలు ఉంటే... అతడ్ని వెంటనే క్వారంటైన్‌కు తరలించాలని పుణె జిల్లా పరిషత్ నిర్ణయించడం విశేషం.
పెరుగుతున్న గృహ హింస
లాక్డౌన్ కొనసాగుతున్న వేళ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా గృహ హింస బాగా పెరిగినట్లు కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి: ఐఐటీ కాన్పుర్ కనిపెట్టిన ఈ పరికరంతో కరోనా కట్టడి!