దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పెద్ద ఎత్తున సహకారం అందించినట్లు కేంద్రం వెల్లడించింది. మార్చి 11 నుంచి ఇప్పటి వరకు 3.04 కోట్ల ఎన్-95 మాస్క్‌లను ఉచితంగా పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీటితో పాటు 1.28 కోట్ల పీపీఈ కిట్లు, 10.83 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) మందులను అందించినట్లు పేర్కొంది.
పలు రాష్ట్రాలకు 22,533 స్వదేశీ వెంటిలేటర్లను కూడా పంపించినట్లు పేర్కొంది. ఈ యంత్రాల ఇన్స్టాలేషన్ నుంచి ప్రారంభించటం వరకు కేంద్రమే పర్యవేక్షించినట్లు వెల్లడించింది. ఈ సంక్షోభ సమయంలో మహమ్మారిని నియంత్రించటానికి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను బలోపేతం చేయటం కోసం వైద్య మౌలిక సదుపాయాలను పెంపొందించటంలో కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొంది.
ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ సంస్థలకు పోత్సాహకాలను అందించటం ద్వారా ఎన్-95, వెంటీలేటర్లు, పీపీఈ కిట్లు, ఇతర వైద్య పరికాలను దేశీయంగా తయారు చేసి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇస్తున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి:ఈ ఆరు చిట్కాలతో నిద్రలేమి సమస్య దూరం!