నీట్, జేఈఈ పరీక్షలపై పలు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పరీక్షల నిర్వహణను తప్పుబడుతున్నాయి. కాంగ్రెస్తోపాటు విపక్ష పార్టీల ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో టీఎంసీ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
"పరీక్షల వాయిదాపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిద్దాం. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో వీటిని వాయిదా వేయాలని కోరాం. నీట్, జేఈఈని వ్యతిరేకిస్తున్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లాం. కానీ ఆయన నుంచి స్పందన లేదు."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
మమత ప్రతిపాదనకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మద్దతిచ్చారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని సూచించారు. అయితే అంతకుముందు మరోసారి ప్రధాని నరేంద్రమోదీని విజ్ఞప్తి చేద్దామని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు- శరవేగంగా ఏర్పాట్లు