దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఉన్నావ్ అత్యాచార కేసు నిందితుడు కుల్దీప్ సెన్గర్ను భాజపా ఇంకా ఎందుకు పార్టీ నుంచి తొలగించడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. సెన్గర్కు ఉన్న రాజకీయ అధికారాలు రద్దు చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు ప్రియాంక.
" ఈ నేరస్థుడికి, అతని సోదరుడికి మీ పార్టీలో ఉన్న అన్ని అధికారాలు రద్దు చేయండి ప్రధాని. ఇంకా ఆలస్యమేం కాలేదు. "
-ప్రియాంక గాంధీ ట్వీట్.
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు కారు ప్రమాద ఘటనకు సంబంధించి భాజపా ఎమ్మెల్యే కుల్దీప్ సెన్గర్తో పాటు మరో 8 మందిపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు.
బాధితురాలి కుటుంబాన్ని సెన్గర్ బెదిరించి భయాందోళనకు గురిచేసినట్లు ఎఫ్ఐర్లో పేర్కొన్న విషయాన్ని ట్వీట్లో ట్యాగ్ చేశారు ప్రియాంక.
'నేరస్థులకు భాజపా మద్దతిస్తోంది'
ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితులకు అధికార భాజపా మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు మాయావతి.
"ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎమ్మెల్యేను ఆ పార్టీ ఎంపీ సాక్షి మహరాజ్ జైలులో కలవడాన్ని చూస్తే.. అధికార పార్టీ నేరస్థులకు ఎల్లవేలలా మద్దతుగా ఉంటోందని అర్థమవుతోంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గ్రహించాలి."
-మాయావతి ట్వీట్.
యుపీ ప్రభుత్వానిదే బాధ్యత: అఖిలేశ్
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి రోడ్డు ప్రమాద ఘటనకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్. ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న బాధితురాలి కుటుంబ సభ్యులను అఖిలేశ్ పరామర్శించారు.