రాజ్యసభలో విపక్షాల బలం మరింత క్షీణించనుంది. ఈ ఏడాదిలో పలు దఫాలుగా ఖాళీ అవ్వనున్న రాజ్యసభ సీట్లకు తమ పార్టీ అభ్యర్థులను పంపడం ద్వారా ఎన్డీఏ బలం పెంచుకోనుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం మరింత తగ్గే అవకాశం ఉంది.
రాజ్యసభలో మొత్తం 245 స్థానాలకు గానూ ఈ ఏడాది మొత్తం 68 సీట్లు ఖాళీ అవ్వనున్నాయి. ఏప్రిల్‌లో 51, జూన్‌లో 5, జులైలో 1, నవంబర్‌లో 11 స్థానాలు ఖాళీ అవుతాయి. ఇందులో 19 సీట్లు కాంగ్రెస్ పార్టీ కోల్పోనుంది. అందులో ఆ పార్టీ సొంతంగా తిరిగి మిత్రపక్షాల సహకారంతో ఓ 10 స్థానాలు గెలిపించుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలో ఆ పార్టీ అధికారంలో ఉండడం హస్తం పార్టీకి కలిసి వచ్చే అంశం. ఆయా రాష్ట్రాల నుంచి తిరిగి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోనుంది.
పెరగనున్న ఎన్డీఏ బలం
రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేక ఇబ్బంది పడుతున్న భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకు ఈ సారి బలం పెరగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో భాజపా సభ్యులు 82 మంది ఉన్నారు. కాంగ్రెస్‌కు 46 మంది సభ్యులున్నారు. భాజపా అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో 1, ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోనుంది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సైతం అభ్యర్థులను గెలిపించుకుని బలం పెంచుకోనుంది.
పెద్దల సభలో యువనేతలు!
కాంగ్రెస్ పార్టీకి చెందిన మోతీలాల్ వోరా, మధుసూదన్ మిస్త్రీ, కుమార్ సెల్జా, దిగ్విజయ్ సింగ్, బీకే హరిప్రసాద్, ఎంవీ రాజీవ్ గౌడ వంటి సీనియర్ నేతల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్, జూన్‌లో పూర్తి కానుంది. ఇందులో వోరా, సెల్జా, దిగ్విజయ్ మళ్లీ రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈసారి ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింథియా, రణ్‌దీప్ సుర్జేవాలాలను కాంగ్రెస్.. పెద్దల సభకు పంపే అవకాశం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో ఆ పార్టీ తమ అభ్యర్థులను గెలిపించుకునే అవకాశం ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మేఘాలయ, అసోం రాష్ట్రాల పరిధిలోని రాజ్యసభ స్థానాలను కోల్పోనుంది.