ఎన్నికల బాండ్ల అంశంపై విపక్షాలు లోక్ సభలో ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణ సహా ఎన్నికల బాండ్ల అంశంపైనా చర్చకు అనుమతించాలని వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టాయి. విపక్షాల తీరుపై స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా మర్యాదలను కాపాడాలని సూచించారు.
శూన్య గంటలో సభ్యులు ఈ అంశాలను ప్రస్తావించేందుకు అవకాశం కల్పిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. స్పీకర్ హామీతో కాంగ్రెస్ సభ్యులు శాంతించారు. శూన్యగంటలో మాట్లాడిన కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ... కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.
"భారతీయ రిజర్వు బ్యాంకు, ఎన్నికల సంఘం వ్యతిరేకించినా ఈ ప్రభుత్వం ఎన్నికల బాండ్లను జారీ చేసింది. ఎన్నికల బాండ్ల వల్ల ప్రభుత్వ అవినీతి మరింత పెరుగుతుంది. 2017కు ముందు దేశంలో ఓ పటిష్ఠ వ్యవస్ధ ఉండేది. ఈ వ్యవస్థ వల్ల సంపన్నులు జరిపే నగదు వ్యవహారాలపై నియంత్రణ ఉండేది. ఎన్నికల బాండ్ల వల్ల డబ్బు ఇచ్చే దాత వివరాలు తెలియవు. ఎంత డబ్బు విరాళం ఇచ్చారు అన్న దానిపై సమాచారం ఉండదు. తీసుకున్న వ్యక్తి సమాచారం కూడా ఉండదు." - మనీష్ తివారీ, కాంగ్రెస్ సభ్యుడు