శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ఆదాయానికి సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. దేశాన్ని దోచుకున్న వారికి మాత్రమే సబ్సిడీ.. లాభంలా కనిపిస్తుందని ఎద్దేవాచేశారు. 'మహమ్మారి అలుముకున్నవేళ, ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే.. దాన్ని ఆసరాగా చేసుకుని ఈ పేదల వ్యతిరేక ప్రభుత్వం సంక్షోభంలోనూ లాభాలు గడించింది' అని ఆరోపించారు రాహుల్ గాంధీ.
దీనిపై పీయూష్ గోయల్ స్పందిస్తూ... 'దేశాన్ని దోచుకున్న వారికి మాత్రమే సబ్సిడీ.. లాభంలా కనిపిస్తుంది. శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడిపినందుకు రాష్ట్రాలు చెల్లించినదానికంటే ఎక్కువ మొత్తం రైల్వేశాఖ ఖర్చు చేసింది' అని గోయల్ తెలిపారు.
వలస కూలీల టికెట్ల సొమ్మును తమ పార్టీ చెల్లిస్తుందంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఇచ్చిన హామీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఆమె చేసిన ప్రమాణం ఏమైందని ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
లాక్‌డౌన్ వేళ దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలించేందుకు రైల్వే శాఖ శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడిపించారు. అయితే, ఇందుకోసం ఆ శాఖ రూ.2412 కోట్లు వెచ్చించగా.. రూ.429 కోట్లు ఆదాయంగా సమకూరినట్లు ఓ ఆర్‌టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానంలో తేలింది.
ఇదీ చూడండి: 'సంక్షోభాన్ని స్వలాభానికి వాడుకుంటున్న ప్రభుత్వమిది'