లోక్‌సభ స్పీకర్ పదవి దాదాపు బిర్లానే వరించనుంది. ఆయన అభ్యర్థిత్వానికి ఎన్డీఏ మిత్రపక్షాలతో సహా.. 10 పార్టీలు మద్దతు తెలిపాయి.
ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ బిజు జనతాదళ్(బీజేడీ) తీర్మానం చేసింది.
నేషనల్ పీపుల్స్ పార్టీ, శివసేన, మిజో నేషనల్ ఫ్రంట్, అకాలీదళ్, లోక్ జన్‌శక్తి పార్టీ, వైఎస్సార్సీపీ, జేడీయూ, ఏఐఏడీఎంకే, అప్నాదళ్, బీజేడీలు బిర్లా అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించాయి.
ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ, హోం, రవాణా శాఖల మంత్రులు.. లోక్‌సభ స్పీకర్ ఎన్డీఏ అభ్యర్థిగా బిర్లా పేరును ప్రతిపాదించారని తెలిపారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. కాంగ్రెస్‌తోనూ సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. వారు ఇంకా మద్దతు తెలపలేదని.. కానీ వ్యతిరేకించరని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రహ్లాద్.
దాదాపు ఏకగ్రీవమే...
ఎన్డీఏకు పార్లమెంటు దిగువసభలో బలం ఉన్న కారణంగా ఎన్నిక ఏకపక్షంగానే జరిగే అవకాశముంది. 57 ఏళ్ల బిర్లా.. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో భాజపా తరఫున ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం రాజస్థాన్ కోటా-బూందీ పార్లమెంటు స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు బిర్లా.