వరదల కారణంగా ఓ ద్వీపంలో చిక్కుకుపోయిన ప్రజలకు కావాల్సిన సరకులు, అత్యవసర వస్తువులను డ్రోన్ల ద్వారా అందించారు అధికారులు. కర్ణాటకలోని కరకలగడ్డిలో ఈ ఘటన జరిగింది.
స్థానికంగా ఉన్న నారాయణపురా డ్యాం నుంచి భారీగా వరదనీరు రావడం వల్ల ద్వీపంలోని ప్రజలు అక్కడే చిక్కుకుపోయారు. వరద ప్రవాహం భారీగా ఉండటం వల్ల మందులు, కిరాణా సరకుల కోసం కూడా బయటకు రాలేకపోయారు.
వర్సిటీ సహకారంతో
ఈ పరిస్థితుల్లో స్థానిక తాలుకా యంత్రాంగం స్పందించింది. సమస్యను గుర్తించిన అధికారి రాజశేఖరా దంబాలా... స్థానిక వ్యవసాయ యూనివర్సిటీని సంప్రదించారు. ఓ పక్షవాత రోగికి అత్యవసరంగా మందులు అవసరమైన నేపథ్యంలో డ్రోన్ ద్వారా పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీ అధికారుల సహాయంతో అక్కడి ప్రజలకు నిత్యవసరాలను సైతం డ్రోన్ ద్వారా అందజేశారు.
వరద ఉద్ధృతి కారణంగా.. వారిని పునరావాస శిబిరాలకు తరలించే అవకాశం లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఆ దేశాల నుంచి భారత్ నేర్వాల్సిన పాఠాలివే...