ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలోని బాంబు దాడి వ్యవహారంలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు దిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ అధికారులు. ఈ విషయంలో శనివారం సాయంత్రం వరకు పలువురి క్యాబ్ డ్రైవర్లను విచారించిన అధికారులు.. ఎటువంటి సమాచారం లభించలేదని తెలిపారు. విచారణ అనంతరం వారందరినీ పంపించివేసినట్లు వెల్లడించారు.
ముందే సమాచారం
దాడికి సంబంధించి ముందే ఇజ్రాయెల్ రాయబారి అధికారులను హెచ్చరించినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఈ విషయమై నెల రోజుల క్రితమే ఓ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
విమానాలు నిలిపివేత
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత కొన్ని గంటల పాటు అంతర్జాతీయ విమానాల నిలిపివేశారు అధికారులు. టేకాఫ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న మూడు విమానాలను కొన్ని గంటలపాటు ఆపివేసినట్లు వెల్లడించారు. దర్యాప్తు సంస్థలతో సంప్రదింపుల తర్వాత విమానాలకు అనుమతించినట్లు తెలిపారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా సీఐఎస్ఎఫ్ అన్ని విమానాశ్రయాలకు హెచ్చరిక జారీ చేసిందన్నారు.
ఆధారాల సేకరణ
ఆదివారం కూడా ఘటనా స్థలం వద్ద కొన్ని ఆధారాలు సేకరించింది ఫోరెన్సిక్ బృందం. పేలుడులో ఉపయోగించిన బాల్ బేరింగ్లోని ఇనుప గుండ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గత రెండు రోజులుగా మూసి వేసిన అబ్దుల్ కలాం రహదారిని పోలీసులు తెరిచారు.
అనుహ్య స్పందన
ఈ నెల 26న జరిగిన ఘటనలపై విచారణకు సహకరించాలన్న విజ్ఞప్తికి అనూహ్య స్పందన వస్తుందని దిల్లీ పోలీసులు తెలిపారు. తమ వద్ద ఉన్న ఆధారాలు, రికార్డు చేసిన వీడియోలు, గమనించిన పలు విషయాలను ప్రజలు తమతో పంచుకుంటున్నారని వెల్లడించారు. ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు రెండువేల వాట్సప్ చాట్స్ తమ వద్దకు వచ్చినట్లు తెలిపారు పోలీసులు. మరో 200 గ్రూప్ వాట్సప్ చాట్స్, మూడు వేల ఇ-మెయిల్స్, మూడువేల కాల్స్, మూడువేల వీడియోలు, ఐదువేల ఫొటోలు తమకు అందాయని వెల్లడించారు. దేశ రాజధాని ప్రజలు సమాచారం పంచుకునేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు దిల్లీ పోలీసులు.
ఇవీ చూడండి: