జీవితం అన్నీ నేర్పిస్తుంది. కఠిన సవాళ్లను ఎదుర్కొని ఎలా ముందుకు సాగాలో ఓ యువతికి నేర్పించలేకపోయింది. ఒడిశా భద్రక్ జిల్లాకు చెందిన శీతల్ జీవితం 2018 జులై 19 వరకు ఎన్నో ఆశలతో ఎంతో సాఫీగా సాగింది. ఆ రోజు జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఆమె ఆశలను హరించింది. ఎంతగా అంటే అసలు ఆమెకు బతకాలనే ఆశ లేకుండా.
కళ్లముందే అక్క మృతి
గతేడాది జులై 19న పాఠశాల నుంచి తన అక్క, స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తోంది శీతల్. మృత్యురూపంలో వేగంగా వచ్చిన ట్రక్కు వారిపై నుంచి దూసుకెళ్లింది. ప్రమాదంలో శీతల్ సోదరి అక్కడికక్కడే మృతి చెందింది. శీతల్ ఎడమ చేయి, కుడికాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ఆమె తన పనులు కూడా చేసుకోలేకపోతోంది.
ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదు. శీతల్‌కు చికిత్స అందించే ఆర్థిక స్తోమత ఆమె తల్లితండ్రులకు లేదు. ఇక జీవితంపై అన్ని ఆశలు వదులుకున్న శీతల్ మరణమే శరణ్యమని భావించింది. తాను 'యూథనేజియా(కారుణ్య మరణం)' ద్వారా చనిపోయేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వ అధికారులను కోరింది.
యూథనేజియాకు సుప్రీం అంగీకారం
జీవితం చివరాంకంలో ఉన్న రోగుల కారుణ్య మరణాలకు అనుమతిస్తూ 2018 మార్చి 9న సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వైద్యంలేని రోగాల బారిన పడిన వారు, ఎప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నవారు చనిపోయేందుకు 'యూథనేజియా'కు చట్టబద్ధత కల్పించింది.
ఇదీ చూడండి: కోలుకోని ములాయం... మరోమారు ఆస్పత్రిలో చేరిక