ఒడిశాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి తక్కువ ఖర్చుతో వెంటిలేటర్‌ను అభివృద్ధి చేశాడు. శ్వాస ఇబ్బందులతో బాధపడే రోగులకు పంపింగ్ ఎయిర్ బ్యాగ్ సాంకేతికతతో ఈ పోర్టబుల్ వెంటిలేటర్‌ను రూపొందించాడు.
గంజాం జిల్లా భంజానగర్‌కు చెందిన అనన్య అప్రమేయ.. లాక్డౌన్లో ఇంటి వద్ద ఉన్న సమయంలో దీనికి రూపకల్పన చేశాడు. ఇందుకు అతని స్నేహితులు సాయపడ్డారు. ఈ దేశీయ వెంటిలేటర్ 'శ్వాసనేర్'.. కరోనాతో బాధపడుతున్న రోగులను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసినట్లు ఈటీవీ భారత్‌తో అనన్య తెలిపాడు.
"దేశంలో వెంటిలేటర్ల కొరత చాలా ఉంది. దీనిపై దృష్టి పెట్టి 4,5 డిజైన్లను రూపొందించాం. ఇప్పటికే ఎయిర్ బ్యాగ్ సాంకేతికతపై ప్రయోగాలు చేయటం వల్ల దీనికి ప్రాధాన్యం ఇచ్చాం. ఇది దేశంలో వెంటిలేటర్ల డిమాండ్‌ను సమర్థంగా తీర్చగలదు. ఆస్తమా సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ యంత్రాన్ని ఇంట్లోనే ఉపయోగించుకోవచ్చు. అత్యవసర సమయాల్లో రోగులకు ఈ వెంటిలేటర్ ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తుంది. ఇది మార్కెట్లోకి వస్తే చాలా చౌకగా లభిస్తుంది."
- అనన్య అప్రమేయ
ఈ వెంటిలేటర్‌పై ఆసుపత్రుల్లోనూ ప్రయోగాలు చేసినట్లు అనన్య తెలిపాడు. కటక్‌లోని ఆసుపత్రుల్లో రెండు ట్రయల్స్ నిర్వహించినట్లు వెల్లడించాడు. దీన్ని మరింత అభివృద్ధి చేస్తే సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందని అంటున్నాడు అనన్య.
ఇదీ చూడండి: హైదరాబాద్‌లో అతిపెద్ద యూఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్