ఓ నర్సు నిర్లక్ష్యంతో పసిపాప బొటన వేలు తెగిపోయిన ఘటన గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ విషయం బయటకు తెలియకుండా పాపకు వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేసింది ఆసుపత్రి యాజమాన్యం. తల్లిదండ్రుల ఆక్రందనలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఐదు నెలల పసికందుకు ఒంట్లో బాగోలేదని తల్లిదండ్రులు వాదీలాల్ సారాబాయ్ ఆసుపత్రిలో చేర్చారు. నిమోనియా సోకిందన్న వైద్యులు పాపకు వైద్యం చేసి బ్యాండేజ్ వేశారు. దాన్ని తొలగించే క్రమంలో ఓ నర్సు పాప బొటన వేలు కోసేసిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
" పాపకు ఒంట్లో బాగోలేదని ఇక్కడికి వచ్చాం. మంచి చికిత్స అందించారు. ఆసుపత్రి నుంచి వెళ్లేపటప్పుడు పట్టీని తీసేందుకు నర్సుకు పాపను ఇచ్చాం. ఒకటి, రెండు పట్టీలను నర్సు బాగానే తీసింది. మరో పట్టి తీయడంలో ఇబ్బంది పడింది. ఆ పట్టిని తీసేటప్పుడు నిర్లక్ష్యంతో వేలిని కోసేసింది. వేలు తెగి కిందపడింది. మేము వెంటనే డాక్టర్‌కు తెలిపాం. చికిత్స అందించారు. మమ్మల్ని శాంతంగా ఉండాలని చెప్పారు. మేము పోలీసు కేసు పెట్టాం." - పాప తండ్రి
పొరపాటున జరిగింది...
పాప వేలుకు పొరపాటున గాయమైందని, వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేశామని వైద్యులు తెలిపారు.
"పాపకు నిమోనియా సోకింది. నర్సు పాపకు కట్టిన బ్యాండేజ్ తీస్తున్న సమయంలో పొరపాటున బొటనవేలుకు గాయమైంది."-డాక్టర్ జితేంద్ర పారమార్, ఆర్ఎమ్వో
ఈ ఘటనపై ఓ కమిటీ వేశామని, దర్యాప్తు పూర్తయిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఎమ్వో డాక్టర్ జితేంద్ర తెలిపారు.