దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ) చేపడతామని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్ఆర్సీ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో మతపరంగా ఎలాంటి వివక్ష ఉండబోదని స్పష్టం చేశారు.
రాజ్యసభలో ఎన్ఆర్సీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు షా. పౌర జాబితా, పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు మధ్య సంబంధం లేదని స్పష్టం చేశారు.
"సుప్రీం కోర్టు ఆదేశాలతో అసోం రాష్ట్రంలో ఎన్ఆర్సీ చేపట్టాం. దేశవ్యాప్తంగా పౌర జాబితాను చేపట్టే ప్రక్రియలో అసోం కూడా భాగమవుతుంది. ఇందులోని విషయంపై మరోమారు స్పష్టత ఇస్తున్నాను. ఏ మతానికి చెందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలందరినీ ఎన్ఆర్సీ కిందకు తీసుకురావాలని ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. హిందూ, బౌద్ధ, సిక్కు, జైన్ శరణార్థులు భారతీయ సంస్కృతిలో కలవాలని కోరుకుంటున్న వారి కోసం పౌరసత్వ చట్ట సవరణ బిల్లు తీసుకొస్తున్నాం. మతపరమైన దురాగతాలతో బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు ఈ చట్టం ద్వారా పౌరసత్వం కల్పిస్తాం."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
ఇతర మతాలకు చెందిన వారు పౌర జాబితాలో ఉండకూడదని ఎలాంటి నిబంధన లేదని స్పష్టం చేశారు హోంమంత్రి. అన్ని మతాలకు చెందిన భారతీయ పౌరులందరూ ఎన్ఆర్సీలోకి వస్తారని తెలిపారు.
ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు..
అసోం ఎన్ఆర్సీలో చోటు లభించని వారికి ట్రైబ్యునల్‌ను ఆశ్రయించే హక్కు ఉందన్నారు షా. రాష్ట్రవ్యాప్తంగా ట్రైబ్యునల్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాటికి అయ్యే ఖర్చును భరించలేని వారి కోసం ప్రభుత్వమే న్యాయవాదిని ఏర్పాటు చేస్తుదన్నారు.
మరోమారు పౌరసత్వ చట్ట సవరణ బిల్లు..
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు 16వ లోక్‌సభలో ఆమోదం లభించింది. అనంతరం సెలెక్ట్ కమిటీ ఆమోదించింది. కానీ.. లోక్‌సభ రద్దు అయిన కారణంగా మరోమారు ఈ బిల్లును తీసుకురావాలని చూస్తోంది ప్రభుత్వం. ఈ మేరకు స్పష్టతనిచ్చారు షా.
ఇదీ చూడండి: వాట్సాప్‌ను వెంటనే అప్డేట్ చేసుకోండి.. లేదంటే అంతే!