దేశంలో 21 రోజుల లాక్డౌన్ కారణంగా.. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్), 2021 సెన్సెస్(జనగణన) తొలి దశ ప్రక్రియలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని కేంద్ర హోమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నిజానికి ఈ ప్రక్రియలు ఏప్రిల్ 1- సెప్టెంబర్ 30లోపు జరగాల్సి ఉంది. కానీ దేశంలో కరోనా విజృంభిస్తుండటం వల్ల వాయిదా వేయక తప్పలేదు. అయితే వీటిని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని హోంశాఖ వెల్లడించలేదు.
"ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో 2021 జనగణన రెండు దఫాలు(ఇళ్ల జాబితా- ఇళ్ల గణన)గా నిర్వహించాల్సి ఉంది. జనాభా గణన వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 28వరకు జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు హై అలర్ట్ ప్రకటించాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని 2021 సెన్సెస్ తొలి దశ, ఎన్పీఆర్ ప్రక్రియలు.. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వాయిదా వేస్తున్నాం."
--- కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటన
ఈ ప్రక్రియల్లో భాగంగా అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో ప్రమాదకరమని.. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఓ అధికారి తెలిపారు.
ఇదీ చూడండి:- ఎంపీల నిధులతో అవి కొనేందుకు కేంద్రం ఓకే