టీ.. ఎంతో మంది భారతీయుల జీవితాల్లో ఒక భాగం. ఎంతగా అంటే రోజుకు ఒకసారైనా తేనీటి చుక్కతో గొంతు తడవకపోతే గడవనంతగా. ఆ టీలో మళ్లీ ఎన్నో రకాలు.. అల్లం, లెమన్, గ్రీన్, ఇలాచీ, ఇరానీ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాండంత ఉంటుంది.
ఇప్పుడు ఈ జాబితాలోకి అసోంకు చెందిన ఇద్దరు యువకులు ఓ కొత్త రకం టీని చేర్చారు. అదే 'వూలా ఛాయ్'. ఉపమన్యు బోర్కాకోటి, అంగ్షుమాన్ భరాలీ అనే ఇద్దరు మిత్రులు ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
సిసలైన ఉల్లాసానికి..
అస్సామీలో వూలా అంటే ఉల్లాసం అని అర్థం. ఈ కొత్త రకం తేనీరు మనసుకు ఉల్లాసాన్ని అందించడమే కాక అసలు సిసలైన టీను తాగిన అనుభవం అందిస్తుందని ఈ మిత్ర ద్వయం అంటోంది. 2015లో 'ది టీ లీఫ్ థియరీ' పేరుతో ప్రయోగశాల ప్రారంభించి, వూలా టీలో ఇటీవల నాలుగు రకాలను ప్రవేశపెట్టారు. ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
"ప్రస్తుతం వైట్ టీ, గ్రీన్ టీ, డర్టీ డిటోక్స్, కిల్లర్ ఇమ్మెనిటీ అనే నాలుగు రకాల ఉత్పత్తులపై అమ్మకాలు జరుపుతున్నాము."
-ఉపమన్యు బోర్కాకోటి
"ప్రస్తుతం ఈ ఉత్పత్తి విక్రయాలను ఆన్లైన్ ద్వారానే చేపడుతున్నాము. కానీ ఫిబ్రవరి నుంచి అసోం సహా మిగతా ప్రాంతాల్లోకి విస్తరించాలనుకుంటున్నాము. మార్చి- ఏప్రిల్ మధ్య ఎగుమతులను కూడా ప్రారంభిస్తామని ఆశిస్తున్నాను."
-అన్గషుమాన్ భరాలీ
ఏంటి ప్రత్యేకత?
వూలా టీ కోసం రెండు తాజా తేయాకులు, మొగ్గను దగ్గరకు కుదించి ఒక్కచోట కడతారు. టీ ఆకులు విరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. టీ బ్యాగ్ తరహాలో దీన్ని నేరుగా వేడి నీటిలో ముంచితే వూలా ఛాయ్ తయారవుతుంది. విశేషం ఏంటంటే వేడి నీటిలో ముంచిన కాసేపటికి.. కుదించి ఉంచిన తేయాకులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఈ టీ రకంపై పేటెంట్ హక్కుల కోసం వీరు దరఖాస్తు చేసుకున్నారు. రెండు తేయాకులను, ఓ మొగ్గను ఇలా కట్టి ఉంచడం ద్వారా ఫ్లేవర్‌ను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చని చెబుతున్నారు.
డార్జీలింగ్, అరుణాచల్ ప్రదేశ్‌లో పండిన తేయాకులపై పరిశోధనలు చేసిన ఈ స్నేహితులు చివరకు అసోంలో స్థానికంగా పండిన తేయాకునే ఎన్నుకున్నారు. కేవలం రెండు తేయాకులు, మొగ్గతో అమోఘమైన టీని తేనీటి ప్రేమికులు ఆస్వాదించొచ్చని చెబుతున్నారు.
ఇదీ చూడండి : గులాబీ టీ తాగేద్దామా..