కరోనా విషయంలో ఆయా మాధ్యమాల్లో వస్తున్న వదంతల్ని నమ్మొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. మాస్కులు అందరూ ధరించాల్సిన అవసరం లేదని, సామాజిక దూరం పాటిస్తే సరిపోతుందని తెలిపింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 283కు చేరినట్లు వెల్లడించింది.
కరోనా వ్యాప్తిపై దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక విషయాలు వెల్లడించారు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. నేటి నుంచి 111 ల్యాబ్‌లు దేశవ్యాప్తంగా పనిచేయనున్నాయని తెలిపారు.
" అందరూ కలిసికట్టుగా పోరాడితే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలం. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి. దేశవ్యాప్తంగా 111 పరిశోధనశాలలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు రంగంలో ల్యాబ్‌లకు అనుమతించేందుకు సంప్రదింపులు జరుపుతున్నాం. రాష్ట్రాల అవసరాల మేరకు ల్యాబ్‌లను పెంచడంపై పరిశీలిస్తున్నాము. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. అసత్య వార్తలు, వదంతులు నమ్మి ప్రజలు భయాందోళనకు గురికావద్దు. జనంలో ఉన్నప్పుడు ఒక మీటర్ సామాజిక దూరం పాటిస్తే సరిపోతుంది. ఎన్95 మాస్కులు అందరూ ఉపయోగించాల్సిన అవసరం లేదు, అవి కేవలం ఆస్పత్రుల్లోనే వినియోగిస్తారు. మాస్కులకు సంబంధించి అందరూ కేంద్ర మార్గదర్శకాలు పాటించాలి. "
- లవ్ అగర్వాల్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి.
విపత్తు నిర్వహణ నిధులు..
కరోనాపై పోరుకు విపత్తు నిర్వహణ నిధులు వినియోగించుకోవచ్చని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు అగర్వాల్. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 1600 మంది భారతీయులు, విదేశీయులను క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచినట్లు వెల్లడించారు. ఎక్కువగా విదేశాల నుంచి విద్యార్థులు వస్తున్నారని అగర్వాల్ తెలిపారు.
ఇదీ చూడండి: విదేశాల్లోని మన వాళ్లకు భారత్ ఎంబసీల సూచనలు.!