ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లలో మరో ఐదుగురు మరణించారు. తీవ్ర గాయాలతో బాధపడుతూ ఈ రోజు ఉదయం మృతిచెందినట్లు గురుతేగ్ బహదుర్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. దీని వల్ల మృతుల సంఖ్య 18కి చేరింది.
ఈశాన్య దిల్లీలో పౌరసత్వ చట్టంపై జరిగిన ఆందోళనల్లో భారీ హింస చెలరేగింది. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో దిల్లీ వీధుల్లో విధ్వంసం జరిగింది. 18మంది మరణించగా.. 200 మందికిపైగా క్షతగాత్రులయ్యారు.
రంగంలోకి షా...
ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. నిన్న 24 గంటల వ్యవధిలో 3 కీలక భేటీలు నిర్వహించారు. దిల్లీ ప్రభుత్వం, అఖిల పక్షం, ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు.
దిల్లీ నిరసనల్లో తీవ్రంగా గాయపడ్డ షాదార డీసీపీ అమిత్ శర్మ కుటుంబాన్ని పరామర్శించారు కేంద్ర హోంమంత్రి. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు.