మహారాష్ట్ర, గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, సరస్సులు నిండుకుండలను తలపిస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
'మహా' వర్షాలు
మహారాష్ట్ర అంతటా ఇటీవల భారీ వర్షపాతం నమోదైంది. ముంబయి, ఠాణె, పాల్ఘర్లను గత రెండు రోజుల్లో వర్షాలు అతలాకుతలం చేశాయి. నేడు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) సహాయక చర్యలు చేపట్టింది.
గోదావరికి నీటి విడుదల...
నాసిక్‌లో ఎడతెరిపి లేని వర్షాలతో.. గంగాపూర్ డ్యామ్ ప్రమాద స్థాయిని దాటింది. 20,000 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. వరద ప్రవాహానికి ఇక్కడి ఆలయాలు జలమయమయ్యాయి. ప్రసిద్ధ హనుమాన్ విగ్రహం దాదాపుగా నీటమునిగింది.
గుజరాత్లో కుండపోత
వరుణుడి ప్రతాపంతో గుజరాత్ చిగురుటాకులా వణికిపోతోంది. భారీ వరదల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగి.. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే నవసరి జిల్లాలోని 5,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది భారత వైమానిక దళం. అదే జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 45 మందిని కాపాడింది.
గడిచిన రెండు రోజుల్లో వాగై తాలుకాలో 350 మిల్లిమీటర్లు, వల్సాద్, సూరత్‌లలో 256 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇదీ చూడండి: నదిపై జంపింగ్ వస్తేనే అందుతుంది స్కూలింగ్!