ఆ యువకుడు పుట్టింది ముస్లిమేతర కుటుంబంలో. కానీ ఇస్లామిక్ స్టడీస్‌లో పీజీ చేయాలనుకున్నాడు. అదే అరుదనుకుంటే ఆ కోర్సు కోసం రాసిన ప్రవేశ పరీక్షల్లో 73.25 పాయింట్లతో దేశంలోనే తొలి స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచాడు. అతడే రాజస్థాన్‌కు చెందిన శుభం యాదవ్. 21ఏళ్ల యాదవ్‌కు ఇస్లాం బోధనలపై అధ్యయనం చేయాలన్న ఆసక్తి. అందుకోసం కశ్మీర్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం సెప్టంబరులో పరీక్ష రాశాడు. అక్టోబరు 29న విడుదలైన ఫలితాల్లో ప్రథమ ర్యాంకు సాధించి ప్రత్యేకత చాటాడు. ఆ యూనివర్సటీలో 2015లో ఇస్లామిక్ స్టడీస్ సెంటర్‌ను ప్రారంభించగా, ఇప్పటివరకూ పీజీ ప్రవేశ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన తొలి ముస్లిమేతర అభ్యర్థి యాదవే అని వర్సీటీ వర్గాలు వెల్లడించాయి.
దిల్లీ యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో డిగ్రీ చేసిన యాదవ్... ఇస్లామిక్ స్టడీస్‌ను ఎంచుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. "ఇస్లాం మతం హింసను ప్రేరేపిస్తుందని సమాజంలో అపోహ ఉంది. మత విద్వేసాలు పెరుగుతున్న నేటి కాలంలో ఇతరుల మతాలను అర్థం చేసుకోవడం అత్యంత అవసరం" అని యాదవ్ చెప్పారు. తాను భవిష్యత్‌లో సివిల్స్ సర్వీసులో చేరాలనుకుంటున్నట్లు తెలిపాడు యాదవ్.
ఇదీ చూడండి: ఆ ఊరి నిండా అల్లుళ్లే.. కారణమిదే.?