అభివృద్ధికోసం రూ. కోట్లు వెచ్చిస్తున్నామని పాలకులు చెబుతున్నా.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక వసతులు కరవయ్యాయి. సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాలు అనేకం ఉన్నాయి. ఆపద సమయంలో ఊర్లోకి అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితుల్లో రోగులను కిలోమీటర్ల మేర భుజాలపై మోసుకెళ్లాల్సి వస్తోంది. అలాంటి ఘటనే ఛత్తీస్గఢ్ బల్రాంపుర్ జిల్లా జర్వాహి గ్రామంలో చోటు చేసుకుంది.
పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని సుమారు 5 కిలోమీటర్ల మేర మంచంపై మోసుకెళ్లి అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా ఆస్పత్రిలో చేర్పించారు గ్రామస్థులు. సరైన రోడ్డు మార్గం లేక నిత్యం ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ఆస్పత్రికి తీసుకెళ్లే దారిలోనే పరిస్థితి విషమించి గర్భిణీలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
" ఇక్కడ రోడ్డు సౌకర్యం సరిగా లేదు. పూర్తిగా ధ్వంసమైంది. ఇలాంటి పరిస్థితుల్లో డోలీ తయారు చేసుకుని గర్భిణీలను బల్రాంపుర్కు చేర్చుతున్నాం. గర్భిణీల ప్రసవ సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. "
- గ్రామస్థుడు.
గ్రామాలకు వెళ్లే రోడ్లను బాగుచేసేందుకు చర్యలు చేపట్టామని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు అధికారులు.
ఇదీ చూడండి: పరిశోధనల దన్ను లేక ప్రగతి మందగమనం