బిహార్ ఎన్నికల్లో ప్రధాన ప్రచారకర్తగా సినీ నటి కంగనా రనౌత్‌ను రంగంలోకి దింపుతున్నారనే ఊహాగానాలను కొట్టిపారేసింది భాజపా. అలాంటి ఆలోచన తమ పార్టీ వద్ద లేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిహార్ ఎన్నికల భాజపా ఇంఛార్జీ దేవేంద్ర ఫడణవీస్ స్పష్టం చేశారు. కంగన వివాదంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం, సినీనటి కంగనా రనౌత్ మధ్య కొద్దిరోజులుగా వివాదం కొనసాగుతోంది. ఆమెకు వైప్లస్ భద్రత ఏర్పాటు చేయటం, మహా ప్రభుత్వంపై పలువురు భాజపా నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. బిహార్ ఎన్నికల్లో ప్రధాన ప్రచారకర్తగా కంగనాను తీసుకొస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు ఫడణవీస్.
" ఎన్డీఏకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అతిపెద్ద ప్రచారకర్తగా ఉండగా మరొకరి అవసరం లేదు. కరోనా మహమ్మారి పోరుపై ఉద్ధవ్ ఠాక్రే ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ, కంగన అంశంలోనే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు."
- దేవేంద్ర ఫడణవీస్, మాజీ ముఖ్యమంత్రి.
బిహార్ ఎన్నికల్లో భాజపా ఇంఛార్జీగా నియామకమైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఫడణవీస్. 'ఎన్డీఏలో ఎవరు చిన్న, పెద్ద అని లేదు, జేడీయూ, భాజపా, ఎల్జేపీ కలిసి పోటీ చేస్తాయి. భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి.' అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'కంగనాకు భాజపా మద్దతివ్వడం దురదృష్టకరం'