పాలనలో ప్రజలే అత్యున్నతమని.. పాలకుడి జీవితంలో అహంకారం, అబద్ధాలు, వాగ్దానాల విస్మరించే తత్వం ఉండకూడదని విజయదశమి సందర్భంగా సందేశమిచ్చారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
" అన్యాయంపై న్యాయం, అబద్ధంపై నిజం, అహంకారంపై వివేకం గెలుపునకు నిదర్శనమే దసరా. తొమ్మిది రోజుల పూజల తర్వాత ఏ పరిస్థితుల్లోనైనా పనిచేసే కొత్త సంకల్పం పుట్టుకొస్తుంది.
ప్రజాస్వామ్య పాలనలో ప్రజలే అత్యున్నతం. ఒక పాలకుడి జీవితంలో అహంకారం, అబద్ధం, వాగ్ధానాల ఉల్లంఘనకు చోటులేదు. ఇదే విజయదశమి ఇచ్చే అతిపెద్ద సందేశం".
--సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
ఈ దసరా ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావడమే కాకుండా ప్రజల మధ్య సామరస్యాన్ని, సాంస్కృతిక విలువలను మరింత బలోపేతం చేస్తుందని సోనియా ఆకాంక్షించారు. ఈ పండుగ రోజుల్లో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సత్యమే ఎప్పటికైనా గెలుస్తుందని అన్నారు. వీళ్లతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా, ప్రియాంకా గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.