100 రోజుల పాలన ప్రగతి నివేదికను విడుదల చేసింది నరేంద్రమోదీ ప్రభుత్వం. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, కీలక నిర్ణయాలు, భవిష్యత్తులో చేపట్టబోయే పనులను వివరించే 'జన్ కనెక్ట్' పుస్తకాన్ని దిల్లీలో ఆవిష్కరించారు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్.
అధికరణ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన వంటి నిర్ణయాలను ప్రముఖంగా ప్రస్తావించారు కేంద్ర మంత్రి.
"ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ఇలాంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు లేవు. ఆ నిర్ణయాలకు ఒక ప్రత్యేకత ఉంది. అవి దేశ హితం కోసం, సామాజిక న్యాయం కోసం, పేదలు, ఆదివాసీలు, రైతులు, ఎస్సీల అభివృద్ధి, సంరక్షణ కోసం తీసుకున్న నిర్ణయాలు. మా నిర్ణయాలు ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంచేవి. మా నిర్ణయాలు... ప్రజల అభివృద్ధి కోసం, ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు తీసుకున్నవి. ప్రజల హృదయాలను గెలుచుకునే ఇలాంటి నిర్ణయాలెన్నో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తీసుకున్నాం"
- ప్రకాశ్ జావడేకర్, సమాచార ప్రసార శాఖ మంత్రి.
ఇదీ చూడండి: 'మోదీ 2.0: వంద రోజుల వికాసం, విశ్వాసం, మార్పు'