ప్రశ్న: 23 మంది సీనియర్ నాయకులు రాసిన అసమ్మతి లేఖ కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్యను తెరపైకి తెచ్చింది. పాత తరం వర్సెస్ యువ తరం నాయకుల చర్చ కాంగ్రెస్ వృద్ధిని ప్రభావితం చేస్తుందా?
కాంగ్రెస్ పార్టీ.. ఎప్పటి నుంచో యువ నాయకులను ప్రోత్సహించి, వారికి మద్దతిస్తూనే ఉంది. ఇందిరా గాంధీ హయాం నుంచి రాజీవ్ గాంధీ వరకు పార్టీలో ఎంతో మంది యువ నాయకులు చేరారు. వారే ఈ రోజు కీలక నేతలుగా ఉన్నారు. మేమంతా అలా వచ్చినవాళ్లమే. రాహుల్ తర్వాత పార్టీలో చేరిన ఎందరో యువ నాయకులు రాజకీయాల్లో రాణిస్తూ మంచి దశలో ఉన్నారు. యువతకు సహజంగానే మద్దతిచ్చే పార్టీ కాంగ్రెస్. అందుకే పార్టీలో పాత తరం వర్సెస్ యువ తరం అనే చర్చకు తావులేదు. మేమంతా యువతకు స్థానం కల్పించి వారికి మద్దతుగా ఉండాలని భావిస్తున్నాం. జ్యోతిరాధిత్య సింధియా వంటి ఒకటి, రెండు సంఘటనల్లో మాత్రం పార్టీ ఎంతో చేసినా వారిని కాపాడుకోలేకపోయింది.
1980.. నేను, జ్యోతిరాధిత్య సింధియా తండ్రి మాధవరావ్ సింధియా పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నాం. ఏళ్ల తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశా. అప్పుడు మాధవరావ్ కుమారుడు జోత్యిరాధిత్య పార్లమెంటు సభ్యుడు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఓపిక. జోతిరాధిత్య పార్టీని వీడకుండా పార్టీలో ఉంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ ఆయన అసహనానికి గురై వెళ్లిపోయారు.
ప్రశ్న: లేఖపై ఆగస్టు 24న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ఎందుకు అందరూ గులాం నబీ ఆజాద్‌ను లక్ష్యంగా చేసుకున్నారు?
ఆజాద్ లేఖ రాశారు అనేది ఎవరికీ సమస్య కాదు. కానీ ఆ అంశం లేవనెత్తిన సమయం, మీడియాకు లీక్ చేయడమే సీడబ్ల్యూసీ సభ్యులను కలవరపెట్టింది. ఇలా ఎందుకు జరిగిందని వారు ఆశ్చర్యపోయారు. ఆజాద్ అనుభవజ్ఞుడైన నాయకుడు. వాస్తవానికి ఆజాద్, అహ్మద్ పటేల్, అంబికా సోనికి పార్టీలో ప్రత్యేక స్థానం ఉంది. మేము వారిని ఎప్పుడూ గౌరవించాము. ఆజాద్‌ను పార్టీకి ట్రబుల్ షూటర్‌గా పరిగణించింది అధిష్ఠానం. మేము ఏదైనా తప్పు చేస్తే ఆజాద్, అహ్మద్ పటేల్ దాన్ని సరిదిద్దుతారు. అసమ్మతి లేఖ బహిర్గతం అయినప్పుడు, ఈ ఎపిసోడ్ వెనుక ఉన్న ముఖ్య వ్యక్తులలో ఒకరిగా ఆజాద్ పేరు బయటికి వచ్చాక మేమంతా ఆశ్చర్యపోయాం.
ఆజాద్.. సోనియాను కలిసి ఈ విషయంపై చర్చించాల్సింది. కచ్చితంగా ఆయన మాటలకు పార్టీ గౌరవం ఇస్తుంది. అయితే అలా కాకుండా ఇలా రచ్చ చేయడం వల్ల అన్ని రకాల ప్రతికూల నివేదికలు పార్టీ గురించి చక్కర్లు కొడుతున్నాయి. ఇది మాకు బాధ కలిగించింది. అదే భావన సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రతిబింబించింది. ఆజాద్‌ను తిరుగుబాటుకు ప్రయత్నించినట్లు కాదు. కానీ లేఖ బహిర్గతం అవడంపైనే సీడబ్ల్యూసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చర్చ జరిగాక చివరికి సోనియా గాంధీ సమస్యను పరిష్కరిస్తానని అందరికీ హామీ ఇచ్చారు.
ప్రశ్న: రాహుల్ గాంధీ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటే వారేమైనా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారా..?
రాహుల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ఇష్టపడకపోతే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం పెట్టాలని సీడబ్ల్యూసీ చర్చించింది. రాహుల్ తొందరగా బాధ్యతలు చేపట్టాలని మేము కోరుకుంటున్నాము. ఇది సీడబ్ల్యూసీలో ఏకగ్రీవ అభిప్రాయం. 2019 ఆగస్టులోనూ రాహుల్ తన రాజీనామాను వెనక్కి తీసుకోమని సీడబ్ల్యూసీ కోరింది. ఆయన నాయకత్వంపై కాంగ్రెస్ కార్యకర్తలకు పూర్తి నమ్మకం ఉంది. చాలా సవాళ్లు ఉన్నప్పుడు రాహుల్ బాధ్యతలు స్వీకరించారు. అది మా అందరికీ తెలుసు. నేడు పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగ ప్రజాస్వామ్యం దేశంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం వైఫల్యాలపై రాహుల్ మాట్లాడుతున్నారు. ఆయన కాంగ్రెస్ నాయకుడిగా మరింత ఎదిగి.. ప్రతిపక్ష నాయకుడి స్థానంలో రాణిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు యువ నాయకుడు, భారత్‌కు యువ ప్రతిపక్ష నాయకుడు కావాలి. రాహుల్ దేశమంతటా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని.. ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు స్వీకరించాల్సిన సమయం ఇదే.
ప్రశ్న: సీడబ్ల్యూసీ ఎన్నికలు రెండు దశాబ్దాలుగా జరగకపోవడానికి కారణం ఏంటి.?
ఇది పార్టీ ఫోరంలలో తప్ప బహిరంగంగా చర్చించాల్సిన విషయం కాదు. సీడబ్ల్యూసీ మళ్లీ సమావేశమై.. జిల్లా స్థాయి వరకు వివిధ పోస్టులకు ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటుంది. యూత్ కాంగ్రెస్‌కు అంతర్గత ఎన్నికలు పెట్టాలని యువజన విభాగంలో రాహుల్ ఎప్పుడో ప్రస్తావించారు. ఆయన బాధ్యతలు స్వీకరిస్తే కచ్చితంగా అంతర్గత పార్టీ ఎన్నికలకు ప్రాధాన్యం ఇస్తారు. కానీ నేడు దేశం చాలా సవాళ్లు ఎదుర్కొంటోంది. వాటిపైనే దృష్టి పెట్టాల్సి ఉంది. అంతర్గత ఎన్నికలు ఉండాలని మేమంతా సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాము. కాని దానికి సరైన సమయం అవసరం.
ప్రశ్న: అసమ్మతివాదులు లేవనెత్తిన సమస్యలు పరిష్కారం అయినట్లేనా?
అసమ్మతి లేఖలో లేవనెత్తిన అంశాలను సీడబ్ల్యూసీలో చర్చించారు. సోనియా మాటల తర్వాత ఈ విషయం ముగిసింది. ఆజాద్ నాలాగే కాంగ్రెస్ పార్టీ పట్ల అంతే శ్రద్ధ వహిస్తారు. సమస్యలను లేవనెత్తడంలో ఎవరికీ తప్పుడు ఉద్దేశం లేదని నేను భావిస్తున్నాను. మరో ఆరు నెలల్లో ఏఐసీసీ సమావేశం జరుగుతుంది. మరెవరైనా తెరపైకి వస్తే చెప్పలేను కానీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌నే చూడాలి. అప్పటి వరకు మేము నిర్మాణాత్మక ప్రతిపక్షాన్ని చూడాలనుకుంటున్నాము. మోదీ ప్రభుత్వంలో ఏర్పడిన నిరుద్యోగం, అసహనం సహా ఆర్థిక సమస్యలను ఎత్తిచూపడానికి సిద్ధంగా ఉన్నాం.
ప్రశ్న: కాంగ్రెస్ ఎందుకు దూకుడైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతోంది.?
గత రెండేళ్లుగా కాంగ్రెస్ పని విధానానికి సరిపోని అసహజ రాజకీయం ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ దేశ రాజకీయాలను మత పరంగా విభజించాయి. 2017లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాలతో అధికారంలో ఉంటామని భావించాం. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ 'ఖబ్రిస్థాన్-షంషాన్' వంటి వ్యాఖ్యలు చేశారు. ఇది ఎన్నికలను ఏకపక్షం చేయగా.. మేము ఓడిపోయాం. అదే సంవత్సరం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం సమస్యలపై బహిరంగ సభల్లో ప్రశ్నించాం. అప్పుడు మంచి స్థితిలో ఉన్నాం అనుకునే సమయంలో 2019లో పుల్వామా ఉగ్ర దాడి జరిగింది. దానికి ప్రతీకారంగా బాలాకోట్‌లో ఉగ్రవాద రహస్య స్థావరాలపై దాడులు చేసినట్లు మోదీ, మీడియా బాగా ప్రచారం చేశాయి. ఫలితంగా కాంగ్రెస్‌ను పాకిస్థాన్‌కు అనుకూలంగా చిత్రీకరించారు. ఇది దురదృష్టకర విషయం. సంప్రదాయ భారతీయ నీతి.. అన్ని మతాలకు సమానంగా ఉంది. కానీ మతతత్వ విభజనలో భాజపా విజయవంతమైంది. 2019 జాతీయ ఎన్నికలలో ఓడిపోవడానికి కారణం అదే.
ప్రశ్న: గత దశాబ్దాలుగా కాంగ్రెస్ అధ్యక్షుల పనితీరు మారిందా?
ఇందిరా గాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో పని తీరు అదే విధంగా ఉంది. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహరావు, సీతారాం కేసరి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అధ్యక్ష పదవులు రాగానే మారిపోలేదు. రాహుల్ గత 12 సంవత్సరాలుగా సోనియా ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ పనితీరు, అంతర్గత యంత్రాంగాల్లో ఎలాంటి సమస్య లేదు. కానీ గత సంవత్సరాల్లో మారింది దేశ రాజకీయ వాతావరణం మాత్రమే. అది కలుషితమై కాంగ్రెస్‌కు తగినట్లుగా లేదు.
ప్రశ్న: పరిస్థితులు మారతాయని మీరు ఆశిస్తున్నారా?
ప్రజలు తమ ఆహారం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి కీణించడం వంటి సమస్యలపై ఆలోచించినప్పుడు పరిస్థితులు మారతాయి. అప్పుడు వారే మళ్లీ కాంగ్రెస్ చేసిన పనిని మెచ్చుకోవడం ప్రారంభిస్తారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్, ప్రధాని మోదీ సంయుక్తంగా దేశంలో విభజన వాతావరణాన్ని సృష్టించారు. దానికి కాంగ్రెస్ వద్ద సమాధానం ఉంది. కానీ కాంగ్రెస్ తన పోరాటంలోనే ఉంటుంది. అక్కడ ఎవరూ ఓడించలేరు.