దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ... రికవరీలు అధికంగానే ఉన్నాయి. ఇప్పటివరకు కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 25 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరణాల రేటులో నిరంతరం క్షీణత కనిపిస్తోందని, కరోనా పరీక్షలు కూడా జోరుగానే సాగుతున్నాయని తెలిపింది.

ఆరోగ్య శాఖ తెలిపిన కీలక అంశాలు..
- దేశంలో బుధవారం ఒక్కరోజే 9 లక్షలకు పైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 3 కోట్ల 85 లక్షల నమూనాలను టెస్ట్ చేశారు.
- ఇప్పటివరకు 25,23,771 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఫలితంగా రికవరీ రేటు 76.24కు పెరిగింది.
- ప్రస్తుతం దేశంలో 21.93 శాతం యాక్టివ్ కేసులున్నాయి.
- కొవిడ్ మరణాల రేటు 1.83కు తగ్గింది.
- దేశంలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ సంఖ్య 1,550కు పెంచాం.
రికవరీ రేటులో తొలి స్థానంలో..

దేశంలోనే దిల్లీ 90 శాతం రికవరీ రేటుతో ప్రథమ స్థానంలో ఉంది. తమిళనాడు 85 శాతం, బిహార్ 83.80 శాతం, గుజరాత్ 80.20 శాతం, రాజస్థాన్ 79.30 శాతం, అసోం, బంగాల్ రాష్ట్రాలు 79.10 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
మరణాల రేటులో
అసోంలో కొవిడ్ మరణాలు అత్యల్పంగా 0.27 శాతం నమోదు కాగా... ఝార్ఖండ్‌లో అత్యధికంగా 1.09 శాతం మంది వైరస్‌తో చనిపోయారు.
ఇదీ చూడండి: సానుకూలంగా 'కొవిషీల్డ్' వ్యాక్సిన్ మొదటి డోసు ఫలితాలు