దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన భేటీలో.. ఈ నెల 20 నుంచి దిల్లీవ్యాప్తంగా రోజుకు 18వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.
రాజకీయ విభేదాలను పక్కనపెట్టి.. కరోనాపై పోరులో ముందుకు సాగాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం భాజపా పిలుపునిచ్చాయి. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. ఆసుపత్రుల్లో కరోనా బాధితుల కోసం పడకలను పెంచే విషయంపైనా భేటీలో చర్చించినట్టు పేర్కొన్నారు. అధికంగా ఛార్జీలు చేస్తున్న ఆసుపత్రులపై కేంద్రం ఓ నివేదికను అందిస్తుందని.. అనంతరం సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపడతామని హామీనిచ్చారు.
అయితే.. కేంద్రం, దిల్లీ ప్రభుత్వాల వైఫల్యాల వల్లే దేశ రాజధానిలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆరోపించింది కాంగ్రెస్. చివరి ఏడాది విద్యాభ్యాసం చేస్తున్న వైద్య విద్యార్థులను రంగంలోకి దింపి కరోనా పరీక్షలను విస్తృతం చేయాలని సూచించింది.
'లాక్డౌన్ ప్రణాళిక లేదు..'
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీలో మరోమారు లాక్డౌన్ ఆంక్షలు విధించే అవకాశముందన్న ఊహాగానాలకు తెరదించారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. లాక్డౌన్ విధించే ప్రణాళికలేమీ లేవని స్పష్టం చేశారు.
దిల్లీలో కరోనా కేసుల సంఖ్య 41వేలు దాటింది. 1,300 మందికిపైగా మృతిచెందారు.
ఇదీ చూడండి:- దిల్లీలో కరోనా తీవ్రం.. 6 రోజుల్లోనే 10వేల కేసులు