ఈ నెల 16న వెల్లడించిన నీట్ (యూజీ) పరీక్ష ఫలితాల్లో ఎలాంటి తప్పులూ చోటుచేసుకోలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీయే) మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఓఎంఆర్ షీట్లు మార్చారని, వెల్లడించిన ఫలితాలకు, స్కోర్ కార్డుల్లోని మార్కులకు తేడాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది.
నీట్ ఫలితాలపై కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు, వార్తా ఛానళ్లు, డిజిటల్ వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. వాటిని ఎవ్వరూ నమ్మొద్దని తెలిపింది. విత్‌హెల్డ్‌లో పెట్టిన ఓ అభ్యర్థికి 650 మార్కులు వచ్చినట్లు చెప్పుకుంటున్నారని, వాస్తవంగా వచ్చింది 329 మార్కులేనని పేర్కొంది. కొన్ని ఛానళ్లలో వచ్చిన తప్పుడు వార్తలపై ఐటీ చట్టం కింద ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా సైబర్ సెక్యూరిటీ సెల్‌లో ఫిర్యాదు చేసి కేసు నమోదుచేసినట్లు వెల్లడించింది.
కఠిన చర్యలు..
విద్యార్థుల నుంచి వచ్చే నిజమైన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని పరిష్కరిస్తామని, అలా కాకుండా కల్పిత వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాంటి అభ్యర్థుల అభ్యర్థిత్వాలను రద్దుచేయడానికి వెనుకాడబోమని ప్రకటించింది. ఓఎంఆర్ షీట్లు, ఫలితాలను మార్పిస్తామని చెప్పేవారి మాటలను నమ్మి విద్యార్థులు మోసపోవద్దని సూచించింది.
ఇదీ చూడండి: నీట్ పరీక్ష ఫలితాలు విడుదల