కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సొంత పార్టీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయన్న వార్తలను కొట్టిపారేశారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఆర్టికల్ 370ని రాజ్యాంగ విరుద్ధంగా రద్దు చేశారన్నారు.
తమ పార్టీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎప్పుడూ పోరాడుతుందన్నారు. కాంగ్రెస్‌లో సీడబ్ల్యూసీ తీర్మానమే... పార్టీ విధానమని చెప్పారు ప్రియాంక. ఆర్టికల్ 370 రద్దుపై సీడబ్ల్యూసీలో చేసిన తీర్మానమే అంతిమమని స్పష్టం చేశారు.
ఆర్టికల్ 370 కి మద్దతిస్తున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసిన సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా సీడబ్ల్యూసీ తీర్మానంపై సంతకం చేశారని పేర్కొన్నారు ప్రియాంక.
"కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటు పడింది. దానిని మేం కొనసాగిస్తాం. ఆర్టికల్ 370 రద్దు చేసిన విధానం మాకు ఆమోదయోగ్యం కాదు. సీడబ్ల్యూసీలో జ్యోతిరాదిత్య సింధియా కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీర్మానంపై ఆయన సంతకం చేశారు. మా పార్టీ భాజపాలా.. కొంతమంది వ్యక్తులనే మాట్లాడించి మిగతావారి గొంతులను నొక్కేయదు. మా పార్టీలో చర్చించేందుకు ఒక వేదిక ఉంటుంది. దానిలో అభిప్రాయలు చర్చిస్తాం. తర్వాత పార్టీ విధానాన్ని నిర్ణయిస్తాం."-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
ఇదీ చూడండి: 'మహోన్నత వ్యక్తిత్వం సుష్మాస్వరాజ్ సొంతం'