మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధం ఇంకా వీడడం లేదు. కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఊహాగానాలు వెలువడినప్పటికీ..అలా జరగలేదు. రోజంతా నాటకీయ పరిణామాల మధ్య శివసేనకు మద్దతిచ్చే విషయంపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వలేదు. మరోసారి ఎన్సీపీతో చర్చలు జరపనున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్లు గవర్నర్‌ను కలిసి వివరించిన శివసేన తమకున్న మద్దతు నిరూపించుకునేందుకు మరింత గడువు కోరినట్లు తెలిపింది. అందుకు గవర్నర్ నిరాకరించినట్లు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వెల్లడించారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. సేనకు మద్దతిచ్చేందుకు వారు సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ మౌనం
కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధంగా ఉండగా.... శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై హస్తం పార్టీ పెదవి విప్పటం లేదు. దీనిపై చర్చించేందుకు దిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ రెండుసార్లు సమావేశమైంది. శివసేనకు మద్దతిస్తే ఎన్సీపీతో కలిసి ప్రభుత్వంలో చేరాలా? లేకపోతే బయట నుంచి ఆ పార్టీకి మద్దతివ్వాలా అనే అంశంపై చర్చించినట్టు సమాచారం.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కాంగ్రెస్ అధిష్ఠానం రేపు మరోమారు సమావేశమై చర్చలు జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అంతకు ముందు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడారు.
భాజపా పరిశీలన
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకై ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భాజపా నేత ముంగంటీవార్ తెలిపారు.
గవర్నర్ నిర్ణయమే కీలకం
శివసేన ప్రతినిధుల బృందం తనను కలిసినట్లు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు 3 రోజుల గడువు కోరినట్లు చెప్పారు. ఇతర పార్టీల మద్దతు ఉన్నట్లు అధికారిక లేఖను సేన పొందుపరచలేదన్నారు. గడువు పొడిగించేందుకు నిరాకరించినట్లు పేర్కొన్నారు గవర్నర్.