Ministers To Visit Gandhi Bhavan : పార్టీని ప్రజలకు చేరువ చేయడం ద్వారా మరింత బలోపేతం చేయడంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా వారానికి రెండు రోజులు మంత్రులు గాంధీ భవన్ వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు, మంత్రుల షెడ్యూల్‌ను రూపొందించాలని కార్యాలయ సిబ్బందికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా జరిగిన సభలోనే మహేశ్ కుమార్ గౌడ్ ఇందుకు సంబంధించి ప్రతిపాదన చేశారు. ప్రతి వారం ఇద్దరు మంత్రులు, నెలకు ఒకసారి సీఎం రేవంత్‌రెడ్డి గాంధీభవన్ రావాలని సూచించారు.
ప్రజావాణి తరహాలో గాంధీ భవన్‌లో ఫిర్యాదులు : మంత్రులు గాంధీభవన్ వచ్చి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లేందుకు ఇది ఉపకరిస్తుందని భావించినట్లు సమాచారం. ప్రజావాణి తరహాలో గాంధీ భవన్‌లో ఫిర్యాదుల స్వీకరణకు ఎలాంటి కార్యాచరణ ఉండాలనే అంశంపై చర్చిస్తున్నారు.
గాంధీభవన్‌లో మంత్రులు : మంత్రులు వారానికి ఇద్దరు చొప్పున గాంధీభవన్‌కు వస్తే ఎన్ని గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలి? ఆయా శాఖలకు విజ్ఞప్తుల్ని పంపించి పరిష్కరించేందుకు ఎలాంటి కార్యాచరణపై అమలుచేయాలి? తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విధానానికి ఆమోదం తెలిపినట్లయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. గాంధీభవన్‌లో మంత్రుల ద్వారా ఫిర్యాదుల స్వీకరణ పార్టీ బలోపేతానికి మరింత దోహదపడుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
"గాంధీ భవన్‌కు వారానికి ఒకసారి ఇద్దరు మంత్రులు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. గాంధీ భవన్‌కు సామాన్యులు తమ సమస్యలకు చెప్పుకోవడానికి వస్తారు. వాళ్ల దగ్గర నుంచి అర్జీలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి నెలలో రెండు సార్లు గాంధీభవన్‌కు వస్తే కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకుంటారు."-మహేశ్‌కుమార్‌గౌడ్, పీసీసీ అధ్యక్షుడు