New Chai Maker to avoid Spilling Tea : టీ తాగనిదే రోజు అస్సలు గడవని వాళ్లుంటారు. కనీసం రోజులో రెండుసార్లు అయినా తాగేవాళ్లు ఉంటారు. ఉదయం లేవగానే బెడ్ కాఫీ తాగుతారు. చకచకా లేచి బ్రష్ చేసి గ్యాస్ స్టవ్ మీద 'టీ'తోనే వంట మొదలుపెడతారు. దాదాపు చాలా మంది టీ తాగిన తర్వాతే రోజు మొదలుపెడతారు. అట్లుందది మరి 'టీ'కి డిమాండ్. తెల్లవారుజామున ఇంట్లో కుటుంబసభ్యులతో లేదా వాకింగ్ వెళితే స్నేహితులతో పక్కా టీ తాగే వాళ్లుంటారు.
కేవలం ఉదయమే కాదు, సాయంత్రమూ స్టాల్ దగ్గర టీ తాగడానికి చాయ్ ప్రియులు క్యూ కడుతుంటారు. ఇంటికి బంధువులు వస్తే, బయట ఫ్రెండ్స్ కలిస్తే, తలనొప్పి వస్తే, మైండ్ రిలీఫ్ కోసమని ఇలా సందర్భమేదైనా టీ తాగుతుంటాం. కొందరైతే టీ తాగకపోతే పొద్దు గడవని పరిస్థితిలో ఉంటారు. ప్రస్తుతం కేవలం టీ కాకుండా అల్లం టీ, బెల్లం టీ, లెమన్ టీ, గ్రీన్ టీ ఇలా రకరకాలుగా చేస్తున్నారంటే 'టీ'కి అంత డిమాండ్ ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం.
ఎంత మరిగించినా టీ పొంగిపోదు : టీ కాచేందుకు స్టవ్ దగ్గర నిలుచుంటామా!. మనం అక్కడున్నంత వరకూ ఏమీ కానే కాదు. కానీ ఇలా పక్కకు కొంచెం వచ్చామో లేదో చటుక్కున టీ పొంగిపోతుంది. ఇక స్టవ్ చుట్టూ టీ పడిన మరకల్ని శుభ్రం చేయడం మరో పెద్ద పని. కొన్నిసార్లు టీ మరిగిపోతుంది. కానీ ఆ సమయంలో వడకట్టే ఫిల్టర్ కనిపించదు. దాని కోసం వెతుక్కోవడం ఇంకో పని. మీకూ ఇలాంటి అనుభవాలు ఉండే ఉంటాయి కదా? ఇలా టీ పెట్టి ఏదో ఒక పని చేసుకుందామన్నా, ఎక్కడ చాయ్ పొంగిపోతుందోనని అక్కడే ఉంటాం.
ప్రస్తుతం మనలాంటి వాళ్లకోసమే 'టీ'ని ఎంత మరిగించినా అది పొంగి పొయ్యిలో పడకుండా ఉండేలా చాయ్ మేకర్ వచ్చేసింది. ఈ చాయ్ మేకర్‌లో పాలు, పంచదార, టీ పొడి వేసుకుని మీరు మీ పని ఎంచక్కా చేసుకోవచ్చు. టీ పొంగిపోతుందన్న భయం అస్సలు ఉండదు. ఈ పాత్రకున్న ప్రత్యేకత అటువంటిది మరి. ఈ పాత్రకున్న ప్రత్యేకమైన ఆకృతి వల్ల చాయ్ పొంగినా తిరిగి ఆ పాత్రలోకే చేరిపోతుంది. అందులోనే ఫిల్టర్ ఉంటుంది. అందువల్ల నేరుగా 'టీ'ని కప్పుల్లోకి ఒంపుకోవచ్చు. నాన్‌స్టిక్, స్టీల్‌తో చేసిన పాత్ర అయినందున శుభ్రం చేయడం కూడా తేలికే.