Potato Peel Benefits: కిచెన్‌లో మనం వృథా అంటూ పడేసే కొన్ని పదార్థాలతో బోలెడన్ని ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇందులో పండ్లు, కాయగూరల తొక్కలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే బంగాళదుంప తొక్క గురించి వివరిస్తున్నారు. ఇందులోని ఆమ్ల గుణాలు క్లీనింగ్ ఏజెంట్‌గా, క్రిమి సంహారిణిగా పనిచేస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆ తొక్కలను ఇంకా దేనికోసం వాడచ్చు? ఎలా వాడాలి? ఇప్పుడు తెలుసుకుందాం
2018లో Agricultural and Food Chemistry జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. బంగాళ దుంప తొక్కలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయట. "Phytochemicals and Antioxidant Activity of Potato Peel Extracts" అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో వారణాసిలోని Banaras Hindu University ప్రొఫెసర్ Dr. Rakesh Kumar Singh పాల్గొన్నారు. (ఇందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇవి కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయ పడతాయని తెలిపారు. బంగాళదుంప తొక్కలో పైబర్, పొటాషియం, విటమిన్ సీ, విటమిన్ బీ లాంటి పోషకాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వివరిస్తున్నారు.
సహజ ఎరువు: ప్రస్తుతం ఇంట్లో పెంచుకునే మొక్కల కోసం సహజ ఎరువులనే వాడుతున్నారు. ఇలాంటి వాటిలో బంగాళదుంప తొక్కలను యాడ్ చేసుకోవాలని నిపుణలుు సూచిస్తున్నారు. ఈ ఆలు తొక్కలను కంపోస్ట్ ఎరువుగా వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇందులో నత్రజని, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయని.. ఇవి మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడతాయని వివరిస్తున్నారు.
క్లీనింగ్: బంగాళదుంప తొక్కలతో చాలా వస్తువులను శుభ్రం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వెండి, తుప్పు పట్టిన పాత్రలను ఈ తొక్కలతో రుద్ది కడిగితే మిలమిలా మెరుస్తాయట.
చర్మ సంరక్షణ: బంగాళదుంప తొక్కను చర్మంపై రుద్దడం వల్ల ముఖంపై దురద, దద్దుర్ల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. నల్ల మచ్చలను తొలగించడంలోనూ సాయపడతాయని అంటున్నారు.
షూ పాలిష్: ఆలుగడ్డ తొక్కలను బూట్లు పాలిష్ చేయడానికి ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. తొక్క లోపలి భాగాన్ని షూలపై రుద్దడం వల్ల మురికి పోయి నీట్‌గా మారతాయని చెబుతున్నారు.
స్నాక్స్: ఇవే కాకుండా బంగాళ దుంప తొక్కలను స్నాక్స్‌గానూ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ తొక్కలను కాల్చి వాటిపై మసాలా చల్లుకుని క్రిస్పీ చిప్స్‌గా తినవచ్చట. ఇందులో ఉండే పుష్కలమైన ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సూచిస్తున్నారు. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుందని.. ఇందులోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'ఈ అలవాట్ల వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్'- అవేంటో తెలుసా? - Reasons for Breast Cancer