ట్రిపుల్ తలాఖ్ కేసులో ముందస్తు బెయిల్ జారీ చేయొచ్చని, ఇందుకు ఎటువంటి అడ్డంకులు లేవని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే బెయిలిచ్చే ముందు బాధితురాలి వాదన వినాలని న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం-2019 ప్రకారం ట్రిపుల్ తలాఖ్ క్రిమినల్ నేరం. మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఈ చట్ట ప్రకారం ముందస్తు బెయిల్‌పై నిషేధం ముస్లిం భర్తలకే వర్తిస్తుందని ధర్మాసనం తెలిపింది. బెయిల్‌కు సంబంధించి చట్టంలోని వివిధ సెక్షన్లను, నేరశిక్షాస్మృతిలో నిబంధనలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు.. కోడల్ని వేధిస్తున్న మహిళకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
గతేడాది ఆగస్టు నెలలో తన భర్త ట్రిపుల్ తలాఖ్ ఇచ్చారంటూ ఓ మహిళ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో నిందితురాలిగా ఉన్న అత్తకు బెయిలివ్వడానికి కేరళ హైకోర్టు నిరాకరించింది. అయితే 2019 చట్టంలోని బెయిల్ నిషేధ నిబంధనలు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన ముస్లిం భర్తకు మాత్రమే వర్తిస్తాయని బాధితురాలి అత్తకు వర్తించవని ధర్మాసనం పేర్కొంది.
ఇదీ చూడండి: కార్యాలయాల్లో కునుకుతీస్తే ఇక వేటే!