బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో అధికార, విపక్ష పార్టీలు ప్రచార జోరును పెంచుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్.. వర్చువల్ ర్యాలీలతో నేటి నుంచి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తొలివిడత ఎన్నికలు జరగనున్న ఆరు జిల్లాల పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్చువల్ ర్యాలీలు నిర్వహించనున్నారని అధికార పార్టీ నేతలు తెలిపారు.
" రానున్న రోజుల్లో నితీశ్‌కుమార్ 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార ర్యాలీలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 12, 13 తేదీల్లో వర్చువల్ ర్యాలీల్లో పాల్గొంటారు. అక్టోబర్ 14 నుంచి వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఎన్నికల సమావేశాలకు నేరుగా హాజరుకానున్నారు. వర్చువల్ ర్యాలీ సోమవారం సాయంత్రం ప్రారంభం కానుంది. ఆరు జిల్లాల్లోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతో మాట్లాడనున్నారు. మంగళవారం రోజు ఉదయం ఐదు జిల్లాల్లోని 11, సాయంత్రం 4 జిల్లాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతో వర్చువల్‌గా భేటీ కానున్నారు. "
- సంజయ్ కుమార్ ఝా, జేడీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి.
రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచార కార్యక్రమాన్ని భాజపా ఖరారు చేసినట్లు తెలిపారు సంజయ్. వాటిపై పూర్తిస్థాయిలో సమాచారం లేకపోయినా.. పలు సందర్భాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి ఒకే వేదికను పంచుకోనున్నారని వెల్లడించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి నితీశ్ కుమార్ కోసం ఓట్లు వేయమని ప్రధాని ప్రజలను కోరనున్నారు. 2017లోఎన్డీఏ కూటమిలో జేడీయూ చేరిన క్రమంలో పలు సందర్భాల్లో ఇరువురు నేతలు ఒకే వేదికను పంచుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్న సందర్భాలు కనిపించాయి.
ఇదీ చూడండి: బిహార్ బరి: 30 'స్టార్స్'తో భాజపా ప్రచారం