చట్టపరంగా ఉన్న లొసుగులు ఉపయోగించుకుని నిర్భయ దోషులు ఉరిశిక్ష అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తుండటం దారుణమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడిన నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు.
చట్టాలు సవరించాలి!
అత్యాచార కేసుల్లో దోషులకు ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చట్టాలు సవరించాల్సిన అవసరముందని, దీనిపై సత్వరమే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సైతం ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం కూడా ఇలాంటి దారుణ నేరాలకు పాల్పడిన వారు మరణశిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తుండటంపై చర్చ జరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
అందరికి వర్తిస్తుంది!
నిర్భయ దోషులకు మరణశిక్ష అమలును వాయిదా వేస్తూ దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే, ఒకే కేసులో ఒకే శిక్ష పడిన దోషుల్లో ఏ ఒక్కరికి శిక్ష అమలు వాయిదా పడినా మిగిలిన వారికీ అది వర్తిస్తుందని నిబంధనలు చెబుతున్నాయి.
లొసుగులే కారణం!
క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించిన 14 రోజుల వరకు దోషుల్ని ఉరి తీయరాదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెబుతున్నాయి. దీంతో నిర్భయ దోషుల ఉరిశిక్ష మరింత జాప్యం చేసేందుకు న్యాయపరంగా ఉన్న అవకాశాల పేరిట తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఉరిశిక్ష పడిన నేరస్తులు తమకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేందుకు ఉన్న సమయాన్ని కుదించాలని కేంద్రం ఇప్పటికే సుప్రీం కోర్టును కోరింది.
ఇదీ చదవండి: నిర్భయ దోషి పవన్ రివ్యూ పిటిషన్ను కొట్టేసిన సుప్రీం