నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఉరి తీసేందుకు తలారి పవన్ జల్లాడ్ ఆధ్వర్యంలో ట్రయల్స్ నిర్వహించారు. ఉరిలో ఉపయోగించే మనీలా తాళ్లను పరీక్షించారు. ఒకే కేసుకు సంబంధించిన నలుగురు దోషుల్ని ఒకేసారి ఉరితీయడం తిహార్ జైలు చరిత్రలో ఇదే తొలిసారి కానుంది. దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకోలేదన్న కారణాలతో ఉరిశిక్ష ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది.
హైకోర్టు విచారణ
దిల్లీ హైకోర్టు బుధవారం ముకేశ్ అభ్యర్థనను కొట్టిపారేసింది. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను దిల్లీలో లేనన్న పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ వ్యాజ్యాన్ని ఇదివరకే ట్రయల్ కోర్టు కొట్టేయగా... ఆ తీర్పును సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు ముకేశ్. దోషి అభ్యర్థనను రుజువు చేసే ఆధారాలేవీ లేవని కేసు విచారించిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ సేథీ పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో ఎలాంటి అవకతవకలు, చట్టవిరుద్ధమైన అంశాలు లేవని స్పష్టం చేశారు.
దిల్లీ కోర్టు విచారణ
మరోవైపు రెండో క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్న కారణంగా ఉరిశిక్షను నిలిపివేయాలని నిర్భయ దోషులు దిల్లీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధర్మేంద్ర రాణా నేతృత్వంలోని ధర్మాసనం... తిహార్ జైలు అధికారులు సహా పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
ఉరిశిక్షకు ఒక్క రోజు(కోర్టు పనిదినాల ప్రకారం) మిగిలి ఉన్న సమయంలో వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి కారణాలేంటని దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.
దీనికి స్పందించిన సింగ్.. దోషులకు సంబంధించి వివిధ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టుకు వివరించారు. అక్షయ్, పవన్‌ల క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్రపతి వద్ద, అక్షయ్ భార్య వేసిన విడాకుల పిటిషన్ బిహార్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష తేదీ అయిన మార్చి 20ని పక్కనబెట్టాలని ధర్మాసనాన్ని కోరారు.
ఈ కేసుకు సంబంధించి తదుపరి వాదనలు గురువారానికి వాయిదా వేసింది ధర్మాసనం.