ఉరిశిక్ష.. ఈ పేరు వినడమేగానీ ఎలా అమలు చేస్తారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అప్పుడప్పుడు సినిమాల్లో చూసి.. నిజజీవితంలోనూ అదే విధంగానే ఖైదీలను ఉరితీస్తారేమో అనుకుంటాం. అయితే కారాగారంలో ఓ ఖైదీని ఉరి తీయాలంటే జైలు అధికారులకు ఎన్నో నిబంధనలుంటాయి. అవేంటంటే..
ఉరిశిక్ష అమలు ఇలా...
⦁ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, ఇంఛార్జ్ వైద్యాధికారి, రెసిడెంట్ వైద్యాధికారి, జిల్లా కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్ సమక్షంలో ఉరిశిక్ష అమలవుతుంది.
⦁ ఉరిశిక్ష అమలుకు ఒక్కరోజు ముందు ఉరితాళ్లతో పాటు ఉరికంబాన్ని పరీక్షించే ప్రక్రియను జైలు సూపరింటెండెంట్ దగ్గరుండి పర్యవేక్షిస్తారు.
⦁ అనంతరం ఖైదీల బరువుకు 1.5 ఇంతలు బరువుండే ఇసుక బస్తాను ఉరికంబం నుంచి 1.830 నుంచి 2.440 మీటర్ల వరకు కిందకు వదిలి ఉరితాడును పరీక్షిస్తారు.
⦁ ఉరిశిక్ష అమలు ప్రాంతంలో 10 మందికి తక్కువ కాకుండా కానిస్టేబుళ్లు, వార్డెన్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, హెడ్ వార్డెన్లు, అదే సంఖ్యలో జైలు సాయుధ గార్డులు ఉంటారు.
⦁ ఉరిశిక్షను చూసేందుకు దోషుల కుటుంబసభ్యులను అనుమతించరు.
⦁ ఒకవేళ ఖైదీ కోరుకుంటే అతనికి నమ్మకమున్న పూజారిని ఉరిశిక్ష చూసేందుకు అనుమతిస్తారు.
⦁ ఒకరి ఉరిశిక్ష పూర్తయి, మృతదేహాన్ని ఉరికంబం నుంచి తీసేంత వరకు మిగతా దోషులను జైలు గదుల్లోనే ఉంచుతారు.
⦁ ఖైదీల ఆరోగ్య పరిస్థితిని ఉరిశిక్ష తేదీకి నాలుగురోజుల మందే డాక్టర్లు పర్యవేక్షిస్తారు. ఖైదీని ఉరికంబం నుంచి కిందకు ఎంత దూరం వేలాడదీయాలో వైద్యులే సూచిస్తారు.
⦁ ఒక్కో ఖైదీకి రెండు జతల ఉరితాళ్లు సిద్ధం చేస్తారు. వాటిని పరీక్షించిన అనంతరం తాళ్లతో పాటు ఇతర ఉరి సామగ్రిని స్టీలు పెట్టెలో పెట్టి తాళం వేస్తారు. ఆ పెట్టెను జైలు సూపరింటెండెంట్ ఆధీనంలో ఉంచుతారు.
⦁ సూపరింటెండెంట్, జిల్లా కలెక్టర్, వైద్యాధికారి బృందం ఉరిశిక్ష అమలయ్యేనాటి ఉదయమే ఖైదీలను పర్యవేక్షిస్తారు.
⦁ ఉరికంబాన్ని ఎక్కేముందు.. ఖైదీలు ఉరితాడును చూడకుండా అతని ముఖాన్ని గుడ్డతో కప్పేస్తారు.
⦁ ఉరికంబంపై జైలు వార్డెన్లు ఖైదీని పట్టుకుని ఉంటారు. ఆ తర్వాత జైలు సూపరింటెండెంట్ ఆదేశానుసారం ఉరిశిక్ష అమలు చేస్తారు.
⦁ పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తారు.
⦁ ఖైదీల మృతదేహాలను స్మశానవాటికకు తరలించేందుకు అంబులెన్స్‌ను వినియోగిస్తారు.