దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం హత్య కేసులో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. నలుగురు దోషులకు ఈ నెల 20న ఉరి శిక్ష అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతుండగా మరోసారి పిటిషన్లు దాఖలు చేశారు. నాలుగో దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయగా.. దోషి అక్షయ్ కుమార్ రెండోసారి రాష్ట్రపతి క్షమాభిక్షకు అప్పీలు చేసుకున్నాడు. దీంతో ఉరి అమలుపై మరోసారి అనిశ్చితి నెలకొంది.
తిహార్కు చేరుకున్న తలారి
ఇప్పటికే దోషులను ఉరి తీసేందుకు తలారి తిహార్ జైలుకు మంగళవారం చేరుకొని రిపోర్టు ఇచ్చాడు. ఉరిశిక్ష అమలు జరిగే ఒకరోజు ముందు డమ్మీ ఎగ్జిక్యూషన్ నిర్వహిస్తారు. నిర్భయ కేసులో దోషులైన ముకేశ్ కుమార్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్(31)లను ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాల్సి ఉంది.
శిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు న్యాయపరమైన అన్ని అవకాశాలు వాడుకోవడం వల్ల ఇప్పటికే మూడు సార్లు శిక్ష వాయిదా పడింది. దోషులకు అన్ని మార్గాలు మూసుకుపోగా 20న ఉరి అమలుకు ఆదేశిస్తూ డెత్ వారెంట్ జారీ చేసింది దిల్లీ కోర్టు.