అత్యంత ప్రమాదకరమైన నిఫా వైరస్ వ్యాప్తిపై కేరళ ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. కొత్తగా ఏడుగురికి పరీక్షలు నిర్వహించగా... వారిలో ఆరుగురికి వైరస్ సోకలేదని తేలింది.
నిఫా సోకిన విద్యార్థికి వైద్య సహకారం అందించిన ముగ్గురు నర్సులు, ఓ సహాయక నర్సు సహా మరో ముగ్గురు అనారోగ్యం బారిన పడటం అధికారులను ఆందోళనకు గురిచేసింది. వారికి రక్తపరీక్షలు నిర్వహించగా... ఆరుగురికి నిఫా సోకలేదని తేలినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. మరొకరి పరిస్థితిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు.
నిఫా వైరస్ సోకి చికిత్స పొందుతున్న కళాశాల విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు శైలజ. ఆ విద్యార్థిని కలిసిన మొత్తం 314 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు.
నిఫా వైరస్ కారణంగా కేరళలో గతేడాది 17 మంది మృతి చెందారు.
కర్ణాటక అప్రమత్తం...
కేరళలో నిఫా కలకలం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ సరిహద్దులోని 8 జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. అనుమానాస్పద కేసుల చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చూడండి: శుభవార్త: వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ