కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఐఎస్‌ఐఎస్)కు అనుబంధమైన 'ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్'తో సంబంధాలున్న ఐదుగురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుల్లో హైదరాబాద్‌కు చెందిన యువకుడు కూడా ఉన్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించి దిల్లీ న్యాయస్థానంలో ఛార్జిషీట్ సమర్పించినట్టు ఎన్‌ఐఏ అధికారి ఒకరు వెల్లడించారు.
సంఘ విద్రోహ చర్యలే లక్ష్యంగా..
దిల్లీ నివాసులైన జహాన్‌ఝాయిబ్ సమీ(36), హీనా బషీర్(39) దంపతులు సహా.. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్(26), పుణెకు చెందిన సదియా అన్వర్ షేక్(20), నబీస్ సిద్ధిక్ ఖత్రి(27) లను నిందితులుగా పేర్కొన్నారు అధికారులు. ఉగ్రవాద సంస్థతో కలిసి వివిధ మతాలవారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్రోహ చర్యలకు దిగడం, జనసమ్మర్ద ప్రదేశాల్లో పేలుళ్లకు పాల్పడటం వంటి లక్ష్యాలతో వీరు పనిచేస్తున్నట్టు ఆరోపించారు.
ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన 'సావత్ అల్-హింద్(వాయిస్ ఆఫ్ ఇండియా)' మ్యాగజైన్ ఫిబ్రవరి-2020 సంచికను వీరు ప్రచురించారు. దీంతో మార్చి 8న దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం వల్ల అసలు గుట్టు బయటపడింది.
ఇదీ చదవండి: ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్