శ్రామిక్ రైళ్లలో వలస కూలీలకు ఆహారం, నీరు వంటి కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రైల్వేశాఖ సహా గుజరాత్, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ). తిండిలేక కొంత మంది అనారోగ్యానికి గురయ్యారని, ఆకలి కేకలతో అలమటించి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారని తెలిపింది.
శ్రామిక్ రైళ్లు రోజుల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయని, అందులో ప్రయాణిస్తున్న వలస కూలీలు ఎన్నో కష్టాలు పడుతున్నారని పత్రికలో వచ్చిన వార్తను సుమోటోగా స్వీకరించింది ఎన్హెచ్ఆర్సీ. వివరణ ఇవ్వాలని కేంద్రం, రెండు రాష్ట్రాలను కోరింది. పేద ప్రజల ప్రాణాలను కాపాడలేక పోయారని పేర్కొంది.
బిహార్‌లోని ముజఫర్ఫుర్లో ఇద్దరు.. దనాపుర్, ససరాం, గయా, బెగుసరాయ్, జెహానాబాద్‌లో ఒక్కొక్క వలస కూలీ మృతి చెందినట్లు ఎన్హెచ్ఆర్సీ నివేదికలో వెల్లడించింది. వీరిలో నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలిపింది. గుజరాత్ సూరత్ నుంచి మే 16న బయలుదేరిన ఓ రైలు 9 రోజుల తర్వాత ఆలస్యంగా మే 25న బిహార్‌లోని శివాన్ చేరుకున్నట్లు పేర్కొంది.
మీడియాలో వచ్చిన ఈ వార్తలు నిజమైతే అది కచ్చితంగా మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందని ఎన్హెచ్ఆర్సీ స్పష్టం చేసింది. ఆయా కుటుంబాలకు జరిగిన నష్టం భర్తీ చేయలేమని వ్యాఖ్యానించింది. రైళ్లలో వలసకూలీలకు కనీస సదుపాయాలు సహా వైద్య సాయం అందే ఏర్పాట్లకు సంబంధించి తీసుకున్న చర్యలపై గుజరాత్, బిహార్ ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని తెలిపింది. నాలుగు వారాల్లోగా సంబంధిత అధికారులు స్పందించాలని పేర్కొంది.