కొద్ది రోజుల క్రితం దేశ రాజధానిలో చెలరేగిన అల్లర్ల ఘటనపై దర్యాప్తు చేసేందుకు నిజ నిర్ధరణ కమిటీని నియమించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. ఘటన వెనుక వాస్తవాలను వెలికితీయనుంది కమిటీ. ఈ సందర్భంగా అల్లర్లు జరిగిన ప్రాంతాల సందర్శనతో పాటు.. బాధితులను కలవనున్నారు బృందం సభ్యులు. ఈశాన్య దిల్లీ పోలీసు విభాగాన్ని కూడా ఘటనపై ఆరా తీయనున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు అధికారులు.
గత ఆదివారం ఈశాన్య దిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. 3 రోజుల పాటు దిల్లీ అట్టుడికింది. ఈ హింసాత్మక ఘటనలో ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికిపైగా క్షతగాత్రులయ్యారు.
ఘటనా సమయంలో దుండగులు రెచ్చిపోయారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, వాహనాలకు నిప్పంటించారు. ప్రజలు, పోలీసులు ఒకరిపై మరొకరు పెట్రోల్ బాంబులు, రాళ్లు విసురుకొని విధ్వంసం సృష్టించారు. గత 3 దశాబ్దాల్లో ఈశాన్య దిల్లీలో ఇవే అత్యంత తీవ్రమైన అల్లర్లుగా పేర్కొంటున్నారు.
పాఠశాలల బంద్ పొడిగింపు...
అల్లర్లు చెలరేగిన 3 రోజుల తర్వాత నుంచి ఈశాన్య దిల్లీలో పరిస్థితులు మెల్లమెల్లగా అదుపులోకి వస్తున్నాయి. అయినప్పటికీ ఘర్షణలు చెలరేగిన ప్రాంతాల్లోని పాఠశాలలకు మార్చి 7 వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. వార్షిక పరీక్షలు నిర్వహించే పరిస్థితులు లేని కారణంగా.. స్కూళ్ల పునఃప్రారంభం ఇప్పుడే సాధ్యపడదని అధికారులు స్పష్టం చేశారు.