ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన తమకు శుభాకాంక్షలు అంటూ కేంద్రమంత్రి హర్షవర్ధన్ చేసిన ట్వీట్‌పై స్పందించారు విదేశాంగ మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత సుష్మాస్వరాజ్. తనను గవర్నర్‌గా నియమించారన్న సమాచారం నిజం కాదంటూ స్పష్టం చేశారు.
" విదేశాంగ శాఖ పదవి నుంచి వైదొలిగే సందర్భంగా నేను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మాట్లాడాను. నన్ను గవర్నర్‌గా నియమించిన ట్విట్టర్‌కు ఈ వివరణ సరిపోతుందేమో..?" -- సుష్మా స్వరాజ్ ట్వీట్
" ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నన్ను నియమించారని వస్తున్న వార్తల్లో నిజం లేదు." -- సుష్మా స్వరాజ్ ట్వీట్
లోక్‌సభ సీట్లు కేటాయించని భాజపా సీనియర్ నేతలకు గవర్నర్ పదవులు ఇస్తారన్న వాదనలకు కేంద్రమంత్రి హర్షవర్ధన్ ట్వీట్ బలం చేకూర్చింది. సుష్మా స్వరాజ్‌ను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేసి, ఆ తర్వాత తొలగించారు.
"ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన మా సోదరి, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌కు శుభాకాంక్షలు. అన్ని రంగాల్లో మీకున్న అనుభవం వల్ల ఆ రాష్ట్ర ప్రజలు లబ్ధి పొందుతారు" అంటూ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి హర్షవర్ధన్.
ఆరోగ్య కారణాల వల్ల లోక్‌సభ సీటు తనకు కేటాయించవద్దని ఎన్నికలకు ముందే స్వయంగా సుష్మా స్వరాజే భాజపా అధిష్ఠానాన్ని కోరారు. ఇటీవల కొలువుదీరిన మోదీ కేబినెట్లోనూ ఆమెకు చోటుదక్కలేదు. ఆమె స్థానంలో విదేశాంగ మంత్రిగా ఎస్.జయశంకర్ నియమితులయ్యారు.