కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాధితులకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడుతోంది. మహమ్మారితో బాధపడుతున్న వారికి డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు సోకుతున్నట్లు దిల్లీ వైద్యులు గుర్తించారు. ఆస్పత్రిలో చేరిన వారికి కరోనాతోపాటు సీజనల్ వ్యాధుల లక్షణాలు కనిపించడం వల్ల పరీక్షలు చేస్తే వారిలో చాలా మందికి కొవిడ్‌తోపాటు మలేరియా, డెంగ్యూ వంటి ఇతర లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ అయిందన్నారు.
ఒకే వ్యక్తికి 2 వ్యాధులు..
దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 30 ఏళ్ల ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతుండగా.. విపరీతమైన జ్వరం రావడం వల్ల డెంగ్యూ పరీక్ష నిర్వహించారు. ఇందులో అతడికి పాజిటివ్‌గా తేలింది. మరో 16 ఏళ్ల యువకుడికి కొవిడ్-19తోపాటు, మలేరియా పాజిటివ్ వచ్చింది. ఇలా ఒకే వ్యక్తికి రెండు వ్యాధులు నిర్ధరణ కావడం వల్ల చికిత్స అందించేందుకు వైద్యులు సతమతమవుతున్నారు. అయితే దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్నామని దిల్లీ ఎయిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రగ్యాన్ ఆచార్య తెలిపారు.
'దోమల వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఈ సీజన్‌లో డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయని తెలుసు. కానీ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధితులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. వారిలో చాలా మందికి కరోనాతోపాటు డెంగ్యూ లేదా మలేరియా పాజిటివ్ వస్తోంది.' అని సీనియర్ డాక్టర్ ఒకరు చెప్పారు.
వ్యాధి లక్షణాల ఆధారంగా చికిత్స
మరికొందరిలో డెంగ్యూ, మలేరియా రెండూ గుర్తించినట్లు ఆయన చెప్పారు. అయితే.. కరోనా వచ్చిన వారందరికీ డెంగ్యూ, మలేరియా వస్తుందని కచ్చితంగా చెప్పలేమని, వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని వీటికి ఎప్పటిలాగేనే చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
ఇదీ చదవండి: కరోనా పంజా: దేశంలో ఒక్కరోజే 90,632 కేసులు