భారత ప్రధానమంత్రి అధికారిక వెబ్‌సైట్‌కు మరిన్ని హంగులు జోడించి మరింత మందికి చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 6 అంతర్జాతీయ, 22 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచేందుకు పీఎం వెబ్‌సైట్‌ను రీడిజైనింగ్ చేయాలని నిర్ణయించింది. అందుకోసం సంబంధిత ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు కోరింది జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం (ఎన్ఈజీడీ).
ప్రస్తుతం నడుస్తోన్న వెబ్సైట్ 12 భాషల్లో అందుబాటులో ఉంది. వెబ్సైట్ రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణ రంగంలో అనుభవం ఉన్న అర్హత కలిగిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలిపింది ఎన్ఈజీడీ.
" వివరణాత్మక సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్స్‌ను సిద్ధం చేయటం, వెబ్సైట్ అభివృద్ధి, నిర్వహణ కోసం ఎండ్-టు-ఎండ్ మేనేజ్డ్ సేవలు అందించటం సహా 22 భారతీయ, 6 అంతర్జాతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేలా సంస్థ పని చేయాలి. పోర్టల్‌లోని స్టాటిక్, డైనమిక్ కంటెంట్‌ను అనువదించాలి. కొత్త వెబ్సైట్ ప్రస్తుతం ఉన్న వెబ్‌సైట్‌తో అనుసంధానమైన సామాజిక మాధ్యమాలతో సహా అన్ని ప్రముఖ సోషల్ మీడియాలతో రియల్ టైమ్ ఇంటిగ్రేషన్ కలిగి ఉండాలి. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని సామాజిక మాధ్యమాల సమాచారం వెబ్సైట్లో అందుబాటులో ఉండనుంది. "
- ఎన్ఈజీడీ
పీఎం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చే ఆరు 6 యూఎన్ భాషలు.. అరబిక్, చైనీస్, ఆంగ్లము, ఫ్రెంచ్, రష్యన్, స్పానిస్. 22 భారతీయ భాషలు.. అస్సామీస్, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మైతిలి, మలయాళం, మణిపురి, మరాఠి, నేపాలి, ఒరియా, పంజాబి, సంస్కృతం, సంతాలి, సింధి, తమిళ్, తెలుగు, ఉర్దు.
ఆగస్టు 7 చివరి తేదీ..
ఈ ప్రాజెక్టుపై సందేహాల నివృత్తికి జులై 30 చివరి తేదిగా నిర్ణయించింది కేంద్రం. తుది ప్రతిపాదనలు పంపేందుకు ఆగస్టు 7 వరకు గడువు ఇచ్చింది.