దేశంలో పత్రికా రంగానికి ప్రత్యేక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్‌ఎస్) విజ్ఞప్తి చేసింది. ఈ పరిశ్రమ ఇప్పటికే రూ.4వేల కోట్లకుపైగా నష్టపోయిందని తెలిపింది. ప్రభుత్వం ఉపశమనం కల్పించకపోతే వచ్చే ఆరేడు నెలల్లో మరో రూ.15వేల కోట్ల మేర నష్టపోవాల్సి ఉంటుందని వివరించింది. ఈ మేరకు ఐఎన్‌ఎస్ అధ్యక్షుడు శైలేష్ గుప్తా.. కేంద్ర సమాచార, ప్రసార శాఖకు లేఖ రాశారు.
కరోనా వైరస్ కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో పత్రికా పరిశ్రమ కూడా ఒకటని ఐఎన్‌ఎస్ తెలిపింది. ప్రకటనలు, సర్క్యులేషన్ రూపంలో ఆదాయం రావడంలేదని పేర్కొంది. "గత రెండు నెలల్లో పత్రికా పరిశ్రమ రూ.4,000 కోట్ల నుంచి రూ.4,500 కోట్లను నష్టపోయింది. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా కుప్పకూలిన నేపథ్యంలో ప్రైవేటు రంగం నుంచి ప్రకటనలకు అవకాశాలు లేకుండా పోయాయి. వచ్చే 6-7 నెలల్లో ఇదే రీతిలో నష్టాలు కొనసాగే వీలుంది. ఫలితంగా మరో రూ.12వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లను నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది" అని ఐఎన్‌ఎస్ పేర్కొంది. తీవ్ర నష్టాల వల్ల ఉద్యోగులకు వేతనాలు, ముడిసరకు సరఫరాదారులకు చెల్లింపులు చేయడం కష్టమవుతోందని తెలిపింది.
పత్రికా పరిశ్రమతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయమున్న దాదాపు 30 లక్షల మంది కార్మికులు, సిబ్బందిపై ప్రస్తుత నష్టాల ప్రభావం పడుతోందని తెలిపింది. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం ఒక ఉద్దీపన ప్యాకేజీని అమలు చేయాలని కోరింది. న్యూస్‌ప్రింట్‌పై 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని ఉపసంహరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మొత్తం ఖర్చుల్లో న్యూస్‌ప్రింట్ వాటా 40-60 శాతంగా ఉంటోందని తెలిపింది. పత్రికా సంస్థలకు రెండేళ్ల ‘పన్ను విరామాన్ని’ ప్రకటించాలని కోరింది. 'బ్యూరో ఆఫ్ ఔట్‌రీచ్ అండ్ కమ్యూనికేషన్' ప్రకటనల రేటును 50 శాతం పెంచాలని విజ్ఞప్తి చేసింది. ప్రింట్ మీడియా కోసం ఉద్దేశించిన బడ్జెట్‌ను 100 శాతం పెంచాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనల బకాయిలను చెల్లించాలంది.