మహిళల మానాభిమానాల్ని చెరపట్టే గాంధారి కొడుకులు గల్లీకొకడుగా దాపురించిన పాడు కాలంలో సత్వర న్యాయం కోసం అభాగినుల గోడు గుండెల్ని మెలిపెడుతోంది. పసిమొగ్గల పైనా పైశాచికత్వం నానాటికీ పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో పోక్సో చట్టంలో సవరణలు తెచ్చి పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వాళ్లకు మరణశిక్షను ప్రతిపాదించినా అఘాయిత్యాలు ఆగకపోవడం- ఆయా చట్టాలు తమనేమీ చేయలేవన్న నేరగాళ్ల మేరమీరిన కావరానికే నిదర్శనగా నిలుస్తోంది!
లైంగిక దాడులు వేధింపుల నుంచి బాలబాలికల్ని రక్షించేందుకంటూ 2012లో రూపుదిద్దిన పోక్సో చట్టం కింద నమోదైన కేసులూ ఏళ్ల తరబడి ఏమీ తేలకుండా బాధితులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న వాస్తవాన్ని గ్రహించిన సుప్రీంకోర్టు- ఆయా కేసులన్నింటిపైనా శీఘ్రతర విచారణ చేపట్టాలని ఏడాది క్రితమే ఆదేశించింది. ఆ నిర్దేశాల్ని ఔదలదాలుస్తూ పోక్సో సహా అత్యాచార కేసుల్ని వేగంగా విచారించేందుకు దేశవ్యాప్తంగా 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చెయ్యనున్నట్లు మోదీ ప్రభుత్వం మొన్న ఆగస్టు తొలివారంలోనే ప్రకటించింది.
మహిళలు పిల్లలకు సంబంధించి పెండింగులో ఉన్న లక్షా 66 వేల పైచిలుకు కేసుల సత్వర విచారణను వాటికి అప్పగించి, ఏడాది వ్యవధిలో ఒక్కో కోర్టూ 165 కేసుల్ని పరిష్కరించేలా చూడటం కేంద్ర సర్కారు అభిమతంగా ఉంది. పోక్సో చట్టం కింద నమోదైన కేసులు వంద దాటిన జిల్లాల్లో ప్రత్యేకంగా వాటినే విచారించేందుకు కోర్టు ఏర్పాటు కావాలన్న న్యాయపాలిక ఆదేశాలకు అనుగుణంగా 389 జిల్లాల్ని ఎంపిక చేశారు. తక్కిన 634 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో అత్యాచార కేసులతోపాటు, పోక్సో నేరాల విచారణా జరిగేందుకు వీలుకల్పిస్తున్నారు.
మహాత్మాగాంధీ జయంతి నాటినుంచి ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ప్రక్రియ మొదలుకానుందని, అందుకు రూ767 కోట్ల బడ్జెటును ప్రత్యేకించామని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కో కోర్టు ఏర్పాటు నిర్వహణ వ్యయం రూ.75 లక్షలని దడి కట్టేయకుండా బాధితులకు సత్వరం మేలిమి న్యాయం అందుబాటులోకి రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలివిడిగా కృషి చెయ్యాలి!
అత్యాచార బాధితులు ఎదుర్కొనే వేదన జీవితకాలం ఉంటుంది... హత్యకన్నా అత్యాచారమే దారుణమైన నేరం అని మొన్న జూన్లో బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్య అక్షరసత్యం. నిందితులపై ఎఫ్ ఐఆర్ నమోదు నుంచి తుది తీర్పు వెలువడే దాకా అఘాయిత్యానికి గురైన మహిళలు పడే రంపపుకోత హృదయశల్యం! కింద నుంచి పైస్థాయి దాకా మూడు కోట్ల కేసులు పెండింగులో ఉన్న ఇండియాలో ఏ కేసు అయినా ఎప్పటికి తెమిలేను? అన్న ధీమాయే నానావిధ నేరగాళ్లకు కొమ్ములు మొలిపిస్తోంది. సెషన్స్ కోర్టుల్లోనే లెక్కకు మిక్కిలిగా పోగుపడ్డ కేసుల్ని శీఘ్రగతిన తెమిల్చేయడానికి పదకొండో ఆర్థిక సంఘం 2000 సంవత్సరంలో 1734 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును ప్రతిపాదించింది. హైకోర్టులతో సంప్రతించి రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేసిన ఈ కోర్టుల్ని అర్ధాంతరంగా రద్దు చేయరాదన్న సుప్రీం ఆదేశాలతో 2010 దాకా వాటి కాలావధి పొడిగించారు.
పిమ్మట మరో ఏడాది గడువు పెంచాక కూడా 6.56 లక్షల కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లోనే పెండింగులో ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. పద్నాలుగో ఆర్థిక సంఘం రూ.4,144 కోట్లు ప్రత్యేకించి 1,800 ప్రత్యేక కోర్టుల ఏర్పాటును ప్రతిపాదించినా, మొన్న జనవరి నాటికి దేశవ్యాప్తంగా 699 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 60:40 నిష్పత్తిలో వ్యయాన్ని భరించడానికి రాష్ట్రాలు వెనకాడటంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు పడకేసింది. మొన్న జూన్ ఆఖరునాటికి ఉన్న కోర్టుల్లోనే ఆరు లక్షల కేసులు పెండింగులో ఉన్నాయని, 206 కోర్టులు పనిచేస్తున్న యూపీలోనే 4.25 లక్షల కేసులు ఎంతకూ తెమలడం లేదని కేంద్రం పార్లమెంటుకు నివేదించింది. పెండింగ్ కేసుల పరిష్కారానికే కాదు, ఎప్పటికప్పుడు నమోదయ్యేవాటినీ శీఘ్రగతిన పరిష్కరించే చైతన్యశీల న్యాయ దీప్తులుగా కొత్తవాటిని తీర్చిదిద్దాలి!
వ్యాపార వివాదాల పరిష్కారానికి, ఇతర నేరాల విచారణ సత్వర పరిపూర్తికి శాశ్వత ప్రాతిపదికన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును 2003, 2008 సంవత్సరాల్లో కేంద్ర న్యాయసంఘం ప్రతిపాదించింది. మహిళలపై అమానుషాల పరంగా దేశంలోనే తొలి పదిస్థానాల్లో నిలిచిన రాష్ట్రాల్లో ఏడింట ఏ ఒక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టూ నేడు లేకపోవడమే వైచిత్రి! అత్యాచారాల రాజధానిగా దుష్కీర్తి మూటగట్టుకొన్న దిల్లీకి 63 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అవసరం ఉందని కేంద్రప్రభుత్వ నివేదికే 2015లో నిగ్గుతేల్చినా, ఇప్పటికి ఉన్నవి 14; కొత్తగా ఏర్పాటుకు ప్రతిపాదించినవి పదహారు! ఆంధ్రప్రదేశ్లో 18, తెలంగాణవ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్కోర్టులను ఏర్పాటు చేయనున్నారు! చిన్నారుల్ని చిదిమేసే మదమృగాల ఉరవడి ఒకటీ అరా ప్రాంతాలకే పరిమితమైలేదని, 389 జిల్లాలకు విస్తరించి జాతి నైతికతనే ప్రశ్నార్థకం చేస్తోందన్న వాస్తవాల వెలుగులో- కొత్తగా వెలుగుచూసే ప్రత్యేక కోర్టులపైనా, వాటిని సృష్టించే కేంద్ర రాష్ట్ర సర్కార్లపైనా బృహత్తర బాధ్యత ఎంతో ఉంది!
న్యాయార్థులకు సత్వర సాంత్వన దక్కాలన్నా, నేరగాళ్లకు కఠిన దండనలు పడాలన్నా న్యాయ విచారణ ప్రక్రియను సాంతం సంస్కరించి, కేసుల దర్యాప్తు వేగవంతంగా పూర్తి అయ్యేలా నట్లు బిగించి, భిన్నస్థాయుల్లో అధికార గణానికి తగు బాధ్యత, జవాబుదారీతనాల్ని మప్పాలి! ఆయా కోర్టులకు అవసరమయ్యే సాంకేతిక దన్ను పైనా ప్రత్యేక దృష్టి సారించాలి. తప్పుచేస్తే కఠిన శిక్ష తప్పదన్న భీతి కలిగించడంతోపాటు మృగవాంఛల్ని రెచ్చగొట్టే అశ్లీల వెబ్సైట్లను నిషేధించి, రేపటితరంలో రుజువర్తన నూరిపోసే నారుమళ్లుగా పాఠశాలల్ని తీర్చిదిద్దినప్పుడే- మహిళాలోకం తెరిపినపడేది!
ఇదీ చూడండి:'దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదు'